హొసపేటె: సరదాగా చెరువులో స్నానం చేయడానికి వెళ్లిన ఓ యువకుడు మునిగి మృతి చెందిన ఘటన సోమవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో జరిగింది. సిద్దాపుర వడ్డరహట్టికి చెందిన యువకుడు అరుణ్ (19) ఈ ఏడాది ద్వితీయ పీయూసీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. వేసవి సెలవుల్లో కూలి పని కోసం మండ్యకు వెళ్లిన అరుణ్ తమ బంధువు వివాహం కోసం తమ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంటి నుంచి కానాహొసహళ్లికి జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చిన అరుణ్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం సరదాగా చెరువులో స్నానానికి వెళ్లగా ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు చీకటి పడేంత వరకు చెరువులో గాలించినప్పటికీ మృతదేహం లభించలేదు. చివరకు కానాహొసహళ్లి పోలీసులు దావణగెరె జిల్లాలోని హరిహర నుంచి నలుగురు గత ఈతగాళ్లను రప్పించగా, యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. పేదవారైన మృతుని తల్లిదండ్రులు, తమ ఏకై క కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది.
క్యాన్సర్ బాధిత పిల్లల కోసం క్రీడా మైదానం ప్రారంభం
హుబ్లీ: ఎస్‌బీఎం ఆస్పత్రిలో డాక్టర్ నిరంజన్‌కుమార్ 75వ జన్మదినం సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. పిల్లల క్యాన్సర్ విభాగం ఇటీవల ప్రారంభం కాగా కిమోథెరపీ పొందుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. దీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండే పిల్లల్లో ఉత్తేజం నింపడానికి ఈ కొత్త కార్యక్రమం చేపట్టారు. ఉత్తర కర్ణాటకలో తొలిసారిగా నిర్మించిన ఈ ఆట మైదానం చిన్న పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ 100కు పైగా పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. మృదువైన సామాన్లు, బోర్డు గేమ్స్, క్యారంస్ ఆట, వైస్ ఛాన్సలర్ 2 ఏళ్ల పిల్లాడితో క్రికెట్ ఆడటం ద్వారా ఆట మైదానాన్ని అధికారికంగా ప్రారంభించారు. డాక్టర్ తన్వీర్ షేక్ మాట్లాడుతూ క్యాన్సర్ కిమోథెరపీ పిల్లల దేహాన్ని బలహీన పరుస్తుంది. అయితే వారి మనోనిబ్బరం, ఆత్మసైర్యాన్ని తగ్గించలేదన్నారు. ఈ ఆట మైదానం సమగ్ర చికిత్సకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో చికిత్స పూర్తి చేసుకున్న పిల్లలతో పాటు 4వ స్టేజ్ క్యాన్సర్ చికిత్స పొందిన ఓ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్‌తో 4వ స్టేజ్‌లో ఉన్న చిన్నారి వ్యాధిని జయించాడు. ముఖ్యంగా ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 67 శాతం మార్కులు సాధించిన బాధిత బాలిక అందరిలో విశ్వాసాన్ని నింపారు.
బహిరంగ స్థలంలో పొగాకు వాడితే రూ.1000 జరిమానా
హుబ్లీ: బహిరంగ స్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. ఎవరైన వ్యక్తి బహిరంగ స్థలంలో పొగాకు ఉత్పత్తులను వాడరాదు. ఒక వేళ వాడిన పక్షంలో రూ.200 నుంచి రూ.2000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. 21 ఏళ్ల లోపు వ్యక్తులపై నిర్ధిష్ట ప్రాంతంలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల వాడకంపై కూడా నిషేధం విధించారు. 21 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి, అలాగే విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో విడిగా లేదా కట్టల చొప్పున సిగరెట్లు, ఇతర ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. అమ్మేందుకు కూడా దుకాణం పెట్టరాదని ఆయన సూచించారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కనీసం రూ.1000 వరకు జరిమానా విధిస్తామని ఆ ప్రకటనలో ఆయన వివరించారు.
నరేగ పనుల పరిశీలన
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో నరేగ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పరిశీలించారు. సోమవారం రాయచూరు తాలూకా బిజినగేరలో చేపట్టిన నరేగ పథకం పనులను ఆయన పరిశీలించి కూలీ కార్మికులతో చర్చించారు. వేసవిలో ఎండలు అధికంగా ఉండడంతో ఉదయం 6 గంటలకే పనులకు రావాలని, 11 గంటల్లోపు ఇళ్లకు వెళ్లిపోవాలన్నారు. పనులు చేస్తున్న ప్రాంతంలో కార్మికులకు మౌలిక సౌకర్యాలైన తాగునీరు, నీడ కల్పించడం వంటివి చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.
నిరంతర అధ్యయనం అవసరం
రాయచూరు రూరల్: విద్యార్థులు వైద్య రంగంలో నిరంతర అధ్యయనంతో ఉత్తమ పరిణితిని సాధించాలని నవోదయ వైద్య కళాశాల అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి పిలుపు ఇచ్చారు. నగరంలోని నవోదయ వైద్య కళాశాలలో జరిగిన విద్యార్థి సమావేశాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉత్తమ విద్యాభ్యాసానికి కళాశాల అందిస్తున్న బోధనలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవ చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రిజిస్ట్రార్ శ్రీనివాస్, మోహన్ గుప్త, చంద్రమౌళి, సురేష్ బాబు, లక్ష్మి, అపర్ణ, రశ్మీ, స్వప్నిల్‌లున్నారు.


