రాయచూరు రూరల్: భీమా నదిలో స్వచ్ఛతకు యువ బ్రిగేడ్ శ్రీకారం చుట్టింది. ఆదివారం కలబుర్గి జిల్లా అప్జల్‌పుర వద్ద భీమా నదిలో చెత్త చెదారం, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు, దుస్తులు, ఇతరత్ర స్వచ్ఛత కార్యకమానికి శ్రీకారం చుట్టారు. వానకాలం ప్రారంభానికి ముందే వర్షపు నీరు వచ్చి నదిలో చేరక ముందే అపరిశుభ్రతను తొలగించారు. అప్జల్‌పుర యువ బ్రిగేడ్ సంచాలకుడు రాజేంద్ర ఆధ్వర్యంలో 15 మందితో కూడిన బృందం నదీ తీర ప్రాంతాలను శుభ్రం చేశారు.
దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘం
రాయచూరు రూరల్: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘమని రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ అన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో మాజీ సైనికుల క్షేమాభివృద్ధి సంఘాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో శాంతియుతంగా మానవుడు ఉన్నారంటే సైనికుల వల్లేనని గుర్తెరగాలన్నారు. వారిని గౌరవించడం మనందరి కర్తవ్యమన్నారు. మాజీ సైనికుల క్షేమాభివృద్ధి సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జిల్లాధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. కుటుంబం గురించి ఆలోచించని సైనికులు దేశ రక్షణ, శాంతి సౌభ్రాతృత్వం కోసం పాకులాడుతారన్నారు. కార్యక్రమంలో శివరామానంద భారతి స్వామీజీ, వెంకన గౌడ, ధర్మణ్ణ, కృష్టమూర్తి, వీరభద్రయ్య, పంపణ్ణ, చక్రవర్తి, విశ్వనాథ్, రంగనగౌడ, శరణ బసవ, హంపనగౌడ, బసవరాజ్‌లున్నారు.
మసరకల్ ఆస్పత్రికి
జాతీయ స్థాయి అవార్డు
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా మసరకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయి అవార్డును కై వసం చేసుకుంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కమిటీ వచ్చి పరిశీలించిన బృందంలో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీశైల పాటిల్, తమిళనాడు కావేరి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో 91.27 శాతం జాతీయ ఆరోగ్య మిషన్ పథకం నుంచి ఆస్పత్రిలో శుభ్రత, మందుల లభ్యత, రోగులకు చికిత్సలు, స్నేహ సంబంధాలు, అత్యవసర చికిత్సల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, వైద్యులు, నర్సులు, సిబ్బంది మధ్య ఉన్న సమన్వయం వంటి అంశాలను గుర్తించిన బృందం ఎన్‌క్యూఏఎస్ అవార్డుకు ఎంపికై ంది. మసరకల్ ఆస్పత్రి వైద్యులు బనదేశ్, శంశుద్దీన్, సిబ్బంది హరీష్, మల్లయ్య, పర్వేజ్‌ల సేవలను గుర్తించారని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, ఆర్‌సీహెచ్ అధికారిణి నందిత పేర్కొన్నారు.
కొప్పళ జిల్లాలో
నవజాత శిశువు
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో నవజాత శిశువు లభ్యమైన ఘటన వీడియో వైరల్ అయింది. సోమవారం కుకనూరు తాలూకా ద్యాంపురలో అప్పుడే పుట్టిన బిడ్డను వీధి పక్కన పారేసి పరారయ్యారు. గ్రామస్తులు చేరి శిశువును ఎత్తుకుని సకల పరిచర్యలు చేశారు. అనంతరం బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. ఎవరో పురిటి బిడ్డను కర్కశంగా రోడ్డు పక్కన పడేసి పోవడం చూపరులందరి మనస్సులను కలిచి వేసింది.
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ పేర్కొన్నారు. సోమవారం రాయచూరు తాలూకా శక్తినగర్ నుంచి కాడ్లూరు వరకు రోడ్డు, గిల్లేసూగూరు–తురకనడోణ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.


