శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి ఎమ్మెల్యే మారిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడ కాదు.. బీజేపీ నేత జీవరాజ్ కొత్త శాసనసభ్యుడు. శనివారం నుంచి జరిగిన బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఈ పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల రీకౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి డీ.ఎన్.జీవరాజ్ 52 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
సుదీర్ఘంగా లెక్కింపు
శనివారం ఉదయం నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కాగా, సాయంత్రం తానే గెలిచానని సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీటీ రాజేగౌడ ప్రకటించి విజయోత్సవం చేసుకోవడం తెలిసిందే. కానీ వాద వివాదాల మధ్య ఓట్ల బండిళ్ల లెక్కింపు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు కొనసాగించారు. ఫలితాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్‌శెట్టి సమర్పించారు. తరువాత ఫలితాలను ప్రకటిస్తూ జీవరాజ్‌దే విజయమని తెలిపారు. సోమవారం నూతన ఎమ్మెల్యే జీవరాజ్‌కు ధృవీకరణ పత్రాన్ని కూడా పంపిణీ చేశారు.
న్యాయం జరిగింది: జీవరాజ్
జీవరాజ్ శృంగేరి శారదమాత దేవస్థానంలో పూజలు చేసి మాట్లాడుతూ గత ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్ల బండిళ్లను రాజేగౌడ ఖాతాలోకి కలిపారని ఆ రోజునే ఫిర్యాదు చేశానని తెలిపారు. రెండు రోజుల తరువాత ఎన్నికల అధికారులు పోస్ట్ ద్వారా నాకు సమాధానాన్ని పంపించారు. నేను ఆ రోజే గెలిచాను, కానీ మోసం ద్వారా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికి న్యాయం లభించింది. చాలా సంతోషమన్నారు. ఆదివారం రాత్రి అధికారులు తనకు మెయిల్‌లో గెలుపు సమాచారం పంపారన్నారు. సోమవారం ఉదయం తనపై నగర పోలీస్ స్టేషన్‌లో కొందరు కేసు పెట్టారని, డిప్యూటీ సీఎం డీకే శివకుమారే తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఈ విజయాన్ని స్వాగతించారు.
కలెక్టర్ ఏమన్నారు..?
1,822 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించామని కలెక్టర్ గౌరవ్‌శెట్టి తెలిపారు. 2023లో లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌కు 692 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడకు 569 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రీకౌంటింగ్‌లో జీవరాజ్‌కు 690 ఓట్లు పడ్డాయి. రాజేగౌడకు 314 ఓట్లే వచ్చాయి. దీనిని బట్టి రాజేగౌడకు 251 ఓట్లు తగ్గాయని వివరించారు. రాజేగౌడకు మొత్తం 318 చెల్లని ఓట్లు పడ్డాయని తెలిపారు.
ఇది క్రిమినల్స్ కుట్ర: డిప్యూటీ సీఎం
శృంగేరి ఫలితాలు దేశానికే ప్రమాదకరం. అక్కడ కుట్ర జరిగింది, ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేస్తామని డీసీఎం డీ.కే.శివకుమార్ తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ ‘బీజేపీలో ఇంతటి క్రిమినల్‌లు ఉన్నారని తెలియలేదు. సుప్రీంకోర్టుకై నా వెళతాం. అక్కడ బ్యాలెట్ బాక్సులను ముందే తెరిచారు, బ్యాలెట్ పేపర్ అవకతవకలు జరిగాయి. అప్పట్లో అంతా సక్రమమేనని అధికారులు సంతకాలు చేశారు. జయనగరలో కూడా సౌమ్యారెడ్డి 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ ఇప్పటికీ ఓట్ల లెక్కింపు జరగలేదు. శృంగేరిలో ఎలా లెక్కించారు’ అని డీకే ధ్వజమెత్తారు.
తుంగా నది ఒడ్డున కొలువైన శృంగేరి పట్టణంలో రాజకీయ దుమారం
కలెక్టర్ అందజేసిన ధృవీకరణ పత్రంతో నూతన ఎమ్మెల్యే జీవరాజ్
బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో
బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపు
కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజేగౌడకు చుక్కెదురు
రాష్ట్రంలో రెండు చోట్ల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి శృంగేరిలో షాక్ తగిలింది. అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మూడేళ్ల తరువాత ఓడిపోయారు. బ్యాలెట్ల ఓట్ల పునర్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలవడం రాజకీయ ప్రకంపనలకు కారణమైంది.


