బొమ్మనహళ్లి: బెంగళూరు పరిధిలో ఆనేకల్ తాలూకా హెన్నాగరంలో వెలసిన గ్రామ దేవత శ్రీయల్లమ్మ దేవి ఆలయంలో జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. 10కి పైగా గ్రామాల నుంచి భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి జ్యోతులను సమర్పించారు. హెన్నాగరం, యరండహళ్లి, హెచ్.హోసహళ్లి, కాచనాయకనహళ్లి, చందాపుర, బనహళ్లి, శ్రీరాంపుర, బెల్లందూరు, అగర, హారగద్దె తదితర ఊళ్లనుంచి భక్తులు పాల్గొన్నారు. యల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో సహా పలు పూజలు నిర్వహించారు.
ముళ్లపంది వేటగాడు అరెస్టు
మైసూరు: అడవిలో ముళ్లపందిని చంపి, అమ్మడానికి ప్రయత్నించిన వేటగాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. హెచ్‌డి కోట తాలూకాలోని అగసనహుండి బస్టాండు వద్ద హరీష్ అనే వ్యక్తిని నిర్బంధించి, వేట పనిముట్లు, ముళ్లపంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముళ్లపంది మాంసం, ముళ్లు, ఎముకలకు ఔషధ గుణాలు ఉన్నాయనే మూఢ నమ్మకం కారణంగా అక్రమ వేట కొనసాగుతోంది, వన్యప్రాణుల వేట పర్యావరణ సమతుల్యతకు ముప్పు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలను చూస్తే, వెంటనే అటవీ శాఖ హెల్ప్‌లైన్ 1926కు తెలియజేయాలి అని జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.
జాతరలో ప్రమాదం,
20 మందికి గాయాలు
దొడ్డబళ్లాపురం: గదగ్‌లోని తొంటాదార్య మఠంలో జరిగిన జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతరలో ఎగ్జిబిషన్‌లో డ్యాన్సింగ్ ఫ్లోర్ వీల్ విరిగిపడి 20 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వీల్ వేగంగా తిరుగుతుండగా అందరూ ఉత్సుకతతో కేకలు వేస్తున్నారు. ఈ సమయంలో అది విరిగి కుప్పకూలింది. క్షణాల్లోనే జనం హాహాకారాలతో దద్దరిల్లింది. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గదగ్ పట్టణ పోలీసులు జాతర కమిటీ, ఫ్లోర్ వీల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
కూతుర్ని వేధిస్తున్నాడని డెలివరీ బాయ్ హత్య
దొడ్డబళ్లాపురం: నీ కుమార్తెను ప్రేమిస్తున్నా, నాకు ఇచ్చి వివాహం చేయాలని వెంటబడి వేధిస్తున్న యువకున్ని యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి హతమార్చాడు, ఈ సంఘటన యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తండ్రి ఈరయ్య (44), బంధువులు చిన్నయ్య (29), చేతన్ (26), వినాయక (19)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెళగావికి చెందిన రమేశ్ (22) బెంగళూరుకు వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రమేశ్ ఈరయ్య కుమార్తెను వేధించడంతోపాటు ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో రమేశ్‌ని హతమార్చాలని పథకం వేశారు. మిగతా నిందితులతో కలిసి రమేశ్‌ను బార్‌కు తీసుకెళ్లి మద్యం తాగారు. తరువాత కారులో వెళ్తూ తాడుతో గొంతు బిగించి చంపి మృతదేహాన్ని అళ్లాలసంద్ర వద్ద రాజకాలువలో విసిరేసి పరారయ్యారు. పోలీసులు విచారించి అరెస్టు చేశారు. కాగా, రమేశ్‌పై బాగలకోటలో అత్యాచారయత్నం కేసు, మరో బెదిరింపుల కేసు ఉన్నాయి.
ద్రాక్ష, మామిడి తోటలకు వాన దెబ్బ
చిక్కబళ్లాపురం: జిల్లాలోని కె.ముత్తుగదహళ్లి, కన్నమంగళ, చింతడిపి చుట్టుపక్కల గ్రామాలలో ఆదివారం రాత్రి ఈదురు గాలులు, జడివానకు మామిడి, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. ద్రాక్ష చెట్లు చెల్లాచెదురయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పరిహారం అందచేయాలని రైతులు కోరారు.


