బాగల్‌కోటెలో మేటి వర్సెస్‌ వీరణ్ణ | - | Sakshi
Sakshi News home page

బాగల్‌కోటెలో మేటి వర్సెస్‌ వీరణ్ణ

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

సాక్షి, బెంగళూరు: దావణగెరె దక్షిణం, బాగలకోటె విధానసభ నియోజకవర్గాలకు జరిగిన హైఓల్టేజ్‌ ఉప ఎన్నికల ఫలితాలు నేడు సోమవారం ఈవీఎంల నుంచి విడుదల కాబోతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరణించడంతో ఇక్కడ ఉప సమరం జరగడం తెలిసిందే. హస్తానికి అనేక రకాల సమీకరణాలు, అడ్డంకుల మధ్య అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్‌ వరకూ అగ్నిపరీక్షలా సాగింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రెండుచోట్లా ముమ్మరంగా ప్రచారం సాగించి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. రాబోయే ఫలితాలను మూడేళ్ల కాంగ్రెస్‌ పరిపాలన మీద రిఫరెండంగా కొందరు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌కు రెండో ఉప ఎన్నిక

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా ఎదుర్కొన్న రెండో ఉప ఎన్నిక ఇది.. 2024, నవంబర్‌లో 3 నియోజకవర్గాలు శిగ్గాంవి, చెన్నపట్టణ, సండూరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మూడు చోట్లా గెలిచి సత్తా చాటుకుంది. ఇప్పటి ఫలితాలు ప్రజలు పాస్‌ మార్కులు వేశారా లేదా అనేది తేటతెల్లం చేయబోతున్నాయి.

ఎవరు గెలిస్తే ఏమవుతుంది?

సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ మధ్య సీఎం కుర్చీ కోసం పవర్‌ ఫైట్‌ జరుగుతోంది. నేటి ఫలితాల తరువాత ఇది క్లైమాక్స్‌కు చేరనుందనే ప్రచారం సాగుతోంది. దావణగెరె, బాగల్‌కోటెలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఒక లెక్క, ఓడితే మరో లెక్క అన్న చందంగా మారింది. గెలుపు ఓటములను సిద్దరామయ్య, డీకే శివ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోగలరు. రెండు చోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓడిపోతే సిద్ధరామయ్య మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని డీకే వర్గం గళమెత్తే అవకాశముంది. కాంగ్రెస్‌ సర్కారు పనితీరు, పంచ గ్యారంటీ పథకాలు తదితరాలపై ప్రజాభిప్రాయంగా ఓటర్ల తీర్పును పరిగణించే అవకాశముంది.

విజేతలు ఎవరో కొన్ని

గంటల్లో తేలిపోనుంది

నేడే దావణగెరె, బాగల్‌కోటె

ఉప ఎన్నికల ఫలితాలు

రెండింటిపై కాంగ్రెస్‌ కన్ను

బీజేపీ సైతం గంపెడాశలు

ఆశల పల్లకీలో బీజేపీ

శివాజీనగర: ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఏప్రిల్‌ 9న ఉప ఎన్నికలు జరిగాయి. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. రెండు నియోజకవర్గాలలో భారీ భద్రత ఏర్పాటైంది. హెచ్‌.ఎం.మేటీ మరణంతో బాగల్‌కోటె సీటు ఖాళీ అయ్యింది. మేటి కుమారుడు ఉమేశ్‌ మేటి కాంగ్రెస్‌ నుంచి, బీజేపీ నుంచి పాత అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ పోటీ పడ్డారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,78,273 మంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరణ్ణ చరంతిమఠ సోదరుడు మల్లికార్జున చరంతిమఠ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 10 వేల ఓట్లను పొందారు, దీంతో అప్పటి బీజేపీ అభ్యర్థి వీరణ్న ఓటమి పాలయ్యారు. ఈసారి ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

దావణగెరెలో సమర్థ్‌ వర్సెస్‌ శ్రీనివాస

దావణగెరెలో మంత్రి శామనూరు మల్లికార్జున కుమారుడు శ్యామనూరు సమర్థ్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస దాస కరియప్ప పోటీలో ఉండగా, ఎవరిని విజయం వరిస్తుందనేది తేలబోతోంది. ఎన్నికల ఫలితాలపై అంతటా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం.

బీవై విజయేంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ ఎన్నికలలో శ్రమించారు. బీజేపీకి పట్టం కడితే విజయేంద్రకు ఊపు రానుంది. రెండింటిలోనూ జేడీఎస్‌ పోటీ చేయకుండా బీజేపీకి అండగా నిలిచింది. రెండుపార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరిగిందనేందుకు ఫలితాలు అద్దం పట్టబోతున్నాయి. ఒక్క సీటు గెలిచినా బీజేపీలో ఉత్సాహం ఇనుమడించడంతో పాటు జేడీఎస్‌తో దోస్తీ బలపడుతుంది. ఇలా ఫలితాలు ఒక దిక్సూచిగా, రాజకీయ లెక్కాచారాలకు ఒక మార్గం కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement