హోరాహోరీగా టెన్నిస్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా టెన్నిస్‌ టోర్నీ

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

తుమకూరు: తుమకూరులో జరుగుతున్న ఐటీఎఫ్‌డబ్ల్యూ టెన్నిస్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌ పోటీల్లో భారత క్రీడాకారిణి శ్రీనిధి చౌదరి అద్భుతమైన ఆటతో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. 14వ సీడ్‌ నేమ్హా సారా కిస్పోట్టాను హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఓడించింది. మరో పోటీలో స్నిగ్ధ కాంత, 13వ సీడ్‌ అరుణ ముండేను కఠినమైన మూడు సెట్ల పోరాటంలో మట్టి కరిపించింది. పలు మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. 8 స్థానాల కోసం క్రీడాకారిణులు పోటీపడతారు.

కారు దగ్ధం కేసు..

వ్యక్తి ఆత్మహత్య!

దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని నిర్జన ప్రదేశంలో శనివారం ఓ కారు కాలిపోగా అందులో ఓ మహిళ సజీవ దహనమైన ఘటన మరింత క్లిష్టంగా మారింది. కారు నుంచి దూకి పరారైన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మారసంద్ర గ్రామానికి చెందిన రామాంజినప్ప (43) మృతుడు. వివరాలు.. రామాంజినప్పకు పెళ్లయి, తరువాత విడిపోయాడు. ఈ క్రమంలో శనివారంనాడు కారులో ఒక మహిళతో ఏకాంతంగా గడపడానికి వచ్చాడు. ఈ సమయంలో కారు దగ్ధమై ఆమె సజీవ దహనమైంది, పోలీసులు కారును పరిశీలించి విచారణ చేపట్టారు. ఇంతలో ఆదివారం దగ్గరలో రైలు పట్టాలపై అతడు శవమై తేలాడు. చిక్కబళ్లాపురానికి చెందిన ఆ మహిళతో రామాంజినప్పకు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇద్దరూ చనిపోవడంతో కేసు మిస్టరీగా మారింది.

భర్త రెండో పెళ్లికి మొదటి భార్య బ్రేక్‌

దొడ్డలో వింత ఘటన

దొడ్డబళ్లాపురం: గర్భిణి అయిన మొదటి భార్య ఎంట్రీతో కళ్యాణ మండపంలో ఆమె భర్త రెండో పెళ్లి.. పందిరిలోనే నిలిచిపోయింది. పెళ్లికి వచ్చిన అతిథులు ఏమైందోనని చెవులు కొరుక్కున్నారు. సినిమా, సీరియల్స్‌లో జరిగే ఇలాంటి సంఘటన నిజంగానే చోటుచేసుకుంది. వివరాలు... దొడ్డ పట్టణంలో బసవ భవన్‌లో.. లెక్చరర్‌ కుమార్‌కు, వధువుకు ఆదివారం ఉదయం పెళ్లి జరుగుతోంది. మంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోష మధ్య ఓ గర్భిణి అక్కడకు వచ్చింది. తాను కుమార్‌ భార్యనని చెప్పడంతో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి కుమార్‌ను, బాధిత మహిళను స్టేషన్‌ కి తీసికెళ్లారు. అంతకుముందు రోజు రాత్రి కుమార్‌ తన భార్యకు కాల్‌ చేసి పెద్దవాళ్లు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, తాను ఏం చేయలేకపోతున్నానని చెప్పాడు. దీంతో ఆమె ధైర్యం చేసి కేరళ నుంచి అక్కడకు వచ్చింది. తమ పెళ్లి ఫోటోలు, ఇతరత్రా ఆధారాలను చూపడంతో వధువు కుటుంబీకులు కంగుతిన్నారు. ఈ హఠాత్‌ పరిణామంతో పెళ్లి రద్దు కాగా, బంధుమిత్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.

సీఎం సిద్దు మార్పు ఈజీ కాదు

ఎమ్మెల్యే రాయరెడ్డి

శివాజీనగర: ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మార్పు లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని సీఎం ఆర్థిక సలహాదారుడు, ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా గొంతెత్తారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి, అందుకు ప్రజోపయోగ పరిపాలన చేయాలి అని ఖర్గేకు చెప్పానన్నారు. మంత్రివర్గ పునర్విభజన, ముఖ్యమంత్రి మార్పు గురించి ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు గందరగోళమైన ప్రకటనలు చేస్తున్నారు, దీనిపై స్పష్టత ఇవ్వాలని విన్నవించానని చెప్పారు. సీఎం మార్పు లేదు, ఒకవేళ చేయాలనుకుంటే హైకమాండ్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటుందని ఖర్గే తనకు చెప్పారన్నారు. అప్పట్లో సీఎల్పీ భేటీలో సిద్దరామయ్యను ఎన్నుకొన్నారు, ఇప్పుడు సీఎంను మార్పు చేయాలంటే మళ్లీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోరాలన్నారు. మార్పు అంత సులభం కాదన్నారు. ఒకవేళ సీఎంను మార్చితే, మీరే ముఖ్యమంత్రి కావాలని ఖర్గేకు ఆహ్వానం పలికినట్లు రాయరెడ్డి తెలిపారు. సిద్దరామయ్య వర్గీయులు మౌనం దాల్చిన సమయంలో రాయరెడ్డి మద్దతుగా నిలబడడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement