ఊటీ యాత్రలో కడతేరిన ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

ఊటీ యాత్రలో కడతేరిన ప్రాణాలు

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

మైసూరు: ఊటీ విహారయాత్ర మధ్యలోనే రక్తసిక్తమైంది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని కేరళ రోడ్డుపై మద్దయనహుండి సమీపంలో ఆదివారం మట్టిని తీసుకువెళ్తున్న లారీ కారును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. కారులోని ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళకు చెందిన కారు డ్రైవర్‌ మునీర్‌ (30), మునీరా (55), మోహిజ్‌ (3) మృతులు. వివరాలు... మునీరా కుటుంబం కేరళలోని కన్నూరులో జీవిస్తోంది. ఆమె రెండో అల్లుడు మునీర్‌ దుబాయ్‌లో పనిచేస్తుంటాడు. సెలవు పెట్టి అత్తగారింటికి వచ్చాడు, అతని భార్య గర్భవతిగా ఉంది. ఊటీ విహారయాత్రకు వెళ్లాలని కారులో బయల్దేరారు. కోజికోడ్‌ – కొళ్లేగాళ హైవే 766లో ప్రయాణిస్తూ అప్పుడే కేరళను దాటి కర్ణాటకలోకి ప్రవేశించారు. బండీపుర అడవి రేంజిలో ప్రయాణిస్తుండగా ఎర్ర మట్టి లోడుతో కేరళకు వెళ్తున్న కర్ణాటక లారీ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు దూరంగా ఎగిరిపడి గుర్తుపట్టలేనంతగా తుక్కుగా మారిపోయింది. మునీర్‌, మునీరా, ఆమె పెద్ద కూతురి కొడుకు మోహిజ్‌ అక్కడే రక్తపు మడుగులో చనిపోయారు. సానియా మీర్జా (22), సహల్‌ పర్వీన్‌ (28), బిలాల్‌ అనేవారు తీవ్రంగా గాయపడగా, వారికి చామరాజనగరలోని సిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేరళ నుంచి వారి బంధువులు ఆస్పత్రికి చేరుకోగా రోదనలతో మార్మోగింది.

స్థానికుల ఆందోళన

మట్టి, రాళ్లను రవాణా చేసే లారీల కారణంగా కేరళకు వెళ్లే రోడ్డుపై నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వెంటనే రైతు సంఘాల కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితమే టిప్పర్‌ లారీ, కారును ఢీకొనగా కేరళకు చెందిన నలుగురు చనిపోయారని తెలిపారు. టిప్పర్లు, లారీలు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రజలను బలిగొంటున్నారని ఆరోపించారు. సారవంతమైన మట్టి కేరళకు దొంగరవాణా జరుగుతోందని, దీనిని అరికట్టాలని కోరారు. కానీ అధికారులు డబ్బులు తీసుకుంటూ దొంగ రవాణాకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు.

కేరళీయుల కారును మట్టి లారీ ఢీ

అత్త, అల్లుడు, మనవడు మృతి

చామరాజనగర వద్ద విషాదం

Advertisement
 
Advertisement
Advertisement