ప్రజల చెంతకే
హుబ్లీ: వేసవి వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు. దిగుబడిని బట్టి ధరలతో సంబంధం లేకుండా రుచిని ఆస్వాదిస్తాం. అయితే ఆరుగాలం కష్టపడి తోటలు సాగు చేసిన రైతులను దళారీలు మోసం చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పండ్లను కొనుగోలు చేసి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. దీంతో రైతులకు లాభాలు దొరకడం లేదు. ధార్వాడా మామిడి సాగు రైతులు నేరుగా వినియోగదారులకు పండ్లను విక్రయించేందుకు శ్రీకారం చుట్టారు. ధార్వాడా గాంధీ భవన్‌లో జరుగుతున్న ఈ అభియానాలో వినియోగదారులకు వివిధ రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. దళారీలకు చరమగీతం పాడటంతో లాభాలు నేరుగా రైతులకు దక్కుతున్నాయి. బెళగావి, హవేరి, గదగ, ధార్వడా, బాగలకోట తదితర జిల్లాల నుంచి బంగినపల్లి, అల్పాన్ సో, బెంగళూరు బేనీసా తదితర మామిడి రకాలను తీసుకొచ్చి ఒకే చోట విక్రయిస్తున్నారు. కిలో రూ.100 నుంచి 200 దాకా ధరలు పలుకుతున్నాయి. రైతులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయనాలు వాడకుండా సహజంగా పండ్లను మాగబెడుతున్నారు. వినియోగదారులకు మార్కెట్‌లో తిరిగే శ్రమ తొలగి ఒకే చోట్ల నాణ్యత గల పండ్లు లభిస్తున్నాయి. అల్పాన్ సో రకం మామిడి పండ్లకు జాతీయ, అంతర్జాతీయంగా చాలా డిమాండ్‌గా ఉంది. ఇక్కడి మట్టి వాతావరణం వల్ల ఈ పండుకు ప్రత్యేక రుచి తెచ్చి పెడుతుంది. జిల్లాలో సుమారు 12 వేల హెక్టార్ల కన్నా ఎక్కువ ప్రాంతంలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో అల్పాన్ సో రకం అగ్రస్థానంలో ఉంది. ఈ మేలిమి రకం మామిడి పండ్లు సరసమైన ధరలకే దొరుకుతుండటంతో మామిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధార్వాడా గాంధీ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన బ్యానర్
ఆకట్టుకున్న మామిడి రకాలు
ధార్వాడా గాంధీ భవన్‌లో సహజసిద్ధంగా
మాగబెట్టిన మామిడి పండ్ల విక్రయ కేంద్రం ఏర్పాటు
దళారీ వ్యవస్థకు చెక్
రైతులకు దక్కనున్న లాభాలు


