ఆరోగ్య శిబిరాలు సద్వినియెగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శిబిరాలు సద్వినియెగం చేసుకోండి

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

రాయచూరు రూరల్‌: పేద ప్రజలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియెగం చేసుకోవాలని నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు సాజిద్‌ సమీర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఆర్‌.హెచ్‌.ఆరోగ్య కేంద్రంలో ఇషా, అసిఫ్‌, జామియా ఫౌండేషన్‌ ఆధర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాలను ఉద్దేశించి ప్రసంగించారు. 300 మందికి పైగా రోగులు ఆరోగ్య శిబిరాల్లో వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డా.కార్తీక్‌ బాసిత్‌, లతీఫ్‌, హపీజ్‌, జావిద్‌, మనియార్‌, హజరత్‌ బాషా, హసన్‌ మూల్లా, హసీఫ్‌ ఖాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య రక్షణే సర్కార్‌ లక్ష్యం

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంత పేద ప్రజల ఆరోగ్య రక్షణే సర్కార్‌ లక్ష్యమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి యం.బి.పాటిల్‌ తెలిపారు. ఆదివారం విజయపుర జిల్లా దేవర హిప్పరిగిలో 30 పడకల అరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పేదలు సర్కారు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. సర్కారు ఆస్పత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు రాజు గౌడ పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్‌ వ్యవస్థతో ఇబ్బందులు

హుబ్లీ: కాగితం లేని ఆస్తుల నమోదు వంచనకు దారి తీస్తుందని సంబంధిత డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ధార్వాడ జిల్లా రిజిస్ట్రేషన్‌ ముద్రణ శాఖ ద్వారా అనుమతి పొందిన డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతరాజ్‌ పోలా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కావేరి సాంకేతిక ఆధారంగా పేపర్‌ లెస్‌ డిజిటల్‌ నమోదు అములుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ పద్దతి వల్ల ప్రజల ఆస్తువుల రికార్డులకు ఎటువంటి భద్రత ఉండదన్నారు. డీజీ లాకర్‌లో సేవ్‌ కావడం వల్ల ఆస్తి కొనుగోలుకు నికర దాఖలు లభించవని తెలిపారు. ఈ పద్ధతి వల్ల ప్రజలు, డాక్యుమెంట్‌ రైటర్లకు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. తక్షణమే ప్రభుత్వం పేపర్‌ లెస్‌తో పాటు గత వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

బుద్ధుడి బోధనలు ఆదర్శం

కోలారు: బుద్ధుడి తత్వ సిద్ధాతాలను అనుసరించడం ద్వారా ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో బుద్ధుడి సందేశాలు లోకానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కె.వి.ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం నగర సమీపంలోని మంగసంద్ర వద్ద ఉన్న బెంగుళూరు ఉత్తర విశ్వ విద్యాలయంలో బుద్ధ పూర్ణిమ సంధర్భంగా కావ్య బెళదింగళు కవిగోష్టి కార్యక్రమం నిర్వహించారు. కవులు, రచయితలు రచించే ప్రతి వాక్యం లోకానికి ప్రేమను పంచాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆప్త కార్యదర్శి నెలకంటె వెంకటేశయ్య మాట్లాడుతూ.. బుద్ధుడి వ్యక్తిత్వం అత్యంత అధ్భుతమైన శక్తి అని అభివర్ణించారు. కార్యక్రమంలో శరీఫ్‌, అవధి పత్రిక సంపాదకుడు జి.ఎన్‌.మోహన్‌, సాహితి లక్ష్మీపతి కోలార, తదితరులు పాల్గొన్నారు.

2 వంతెనలకు ఆమోదం

కోలారు: అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తిలో రూ.10 కోట్ల ఖర్చుతో రెండు చోట్ల బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ తెలిపారు. ఆదివారం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాలూకాలో క్యాలనూరు సమీపంలో రూ.6 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జి , ఛత్రకోడిహళ్లి వద్ద రూ.4 కోట్ల వ్యయంతో మరో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిధుల విడుదలకు ఆమోదం లభించిందని అన్నారు. అధికారులే చురుగ్గా పని చేయాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement