బళ్లారి అభివృద్ధికి యడియూరప్ప కృషి | - | Sakshi
Sakshi News home page

బళ్లారి అభివృద్ధికి యడియూరప్ప కృషి

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

సాక్షి, బళ్లారి: నగరాభివృద్ధి, బళ్లారి జిల్లా అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప విశేష కృషి చేశారు. ఆయన హయాంలో బళ్లారి జిల్లాకు భారీగా నిధులు విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వీరశైవ లింగాయత్‌ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యడియూరప్ప అభిమానోత్సవానికి సంబంధించి ముందస్తు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 9వ తేదీన చిత్రదుర్గంలో జరిగే యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమానికి బళ్లారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో యడియూరప్ప ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని, అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని గుర్తు చేశారు. తమ లాంటి ఎందరికో రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందించారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యడియూరప్ప తనదైన ముద్రవేసుకున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిత్యం పరితపించిన నాయకుడు అని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ఫోన్‌ ద్వారా సమావేశంలో తన సందేశాన్ని వినిపించారు. యడియూరప్ప అభిమానోత్సవ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్‌షా హాజరవుతారన్నారు. అనివార్య కారణాలతో తాను బళ్లారి సమావేశానికి రాలేకపోయాయని తెలిపారు. చిత్రదుర్గంలో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు. గంగావతి ఎమ్మెల్యే కూడా సమావేశంలో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. యడియూరప్ప ఆశీస్సులతోనే రాజకీయాల్లో రాణించేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న పక్కీరప్ప మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా యడియూరప్ప అభిమానోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీరశైవ సమాజ ప్రముఖులు విరుపాక్షి గౌడ, జానేకుంట బసవరాజు, మహేశ్వరయ్య స్వామి, గురులింగన గౌడ, పంచాక్షరప్ప, కోలారు చంద్రశేఖర గౌడ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement