పసికందు ముందే తల్లి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పసికందు ముందే తల్లి ఆత్మహత్య

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

యశవంతపుర: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది. భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్‌, మరిది వినిష్‌లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి.

5 నుంచి పీణ్య

పై వంతెనపై ఆంక్షలు

యశవంతపుర: బెంగళూరులో ఎంతో ముఖ్యమైన పీణ్య ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ పాక్షికంగా మూతపడనుంది. వంతెన కేబుల్‌ మరమ్మతుల కోసం కొన్నిరోజులు బంద్‌ అవుతుంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ రోజూ ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పీణ్య వంతెనను మూసేస్తారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని అధికారులు తెలిపారు. బెంగళూరుకు వచ్చేవారు కెన్న మెటల్‌ ఫ్యాక్టరి సమీపంలో పై వంతెన కింది భాగంలో ఎన్‌హెచ్‌–4 సర్వీసు రోడ్డు ద్వారా నగరంలోకి ప్రవేశించాలని తెలిపారు.

ఘనంగా

చన్నకేశవ రథోత్సవం

కేజీఎఫ్‌: కేజీఎఫ్‌ తాలూకాలోని రామసాగర గ్రామంలో వెలసిన శ్రీ భూనీల సమేత చన్నకేశవ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్టుకు వివిధ హోమాలు సహా మహా మంగళారతి తరువాత ఉత్సవమూర్తులు తేరులో ప్రతిష్టించి రథోత్సవాన్ని ప్రారంభించారు. తేరుపైకి భక్తజనం దవనం, అరటి పండ్లు విసిరారు.

సపలాంబదేవి ఊరేగింపు

మాలూరు: తాలూకాలోని బంటహళ్లి గ్రామంలో నూతనంగా భక్తుల సహాయంతో నిర్మించిన శ్రీ సపలాంబ దేవి ప్రతిష్టాపనా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శనివారం దేవాలయంలో సపలాంబ దేవి ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించి, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. మహిళలు తంబిట్లు దీపాలను తలపై మోసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే కె ఎస్‌ మంజునాథ్‌ గౌడ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement