శివాజీనగర: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారుల మీద నిర్దాక్షిణ్యంగా క్రమశిక్షణా చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఘాటుగా హెచ్చరించారు. శనివారం విధానసౌధలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, శాఖల అధిపతులు, ఐఏఎస్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి గోడ కూలి 7 మంది చనిపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వాడీవేడిగా సభ సాగింది.
అలసత్వం, అవినీతి వద్దు
సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ప్రజోపయోగ కార్యక్రమాలు, పథకాలలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తే సహించను. పనుల్లో లోపాలు కనిపిస్తే అధికారులను బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాలను వేగిరం చేయాలన్నారు. ఈ పథకాలపై కొంతమంది అధికారులు సక్రమంగా పనిచేయడం లేదన్న సిద్దరామయ్య.. ఇలాంటి ధోరణిని సహించనని మండిపడ్డారు. పథకాల అమలుకు నిధుల కొరత ఉందని నెపం చెప్పి కాలక్షేపం చేయవద్దన్నారు. బడ్జెట్ పథకాలకు ఆర్థిక వనరులను అందజేస్తాం, కాలపరిమితిలో అమలు పరచాలని ఆదేశించారు. ఎక్కడా అవినీతికి తావుండరాదన్నారు. అధికారులు కార్యాలయాలకు వచ్చి పని చేయాలి. ఎక్కడో కూర్చొని ఫైళ్లు పరిష్కరిస్తామంటూ నేను సహించను అని తెలిపారు. ప్రజల సమస్యల మీద స్పందించాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సమాచార పథకాల పరిశీలన గురించి నూతన కర్ణాటక ప్రగతి పోర్టల్, డెయిరీని సీఎం ఆవిష్కరించారు. సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఐఏఎస్‌లపై సీఎం సిద్దు ఉగ్రరూపం
బడ్జెట్ పథకాలను అమలు
చేయాలని ఆదేశం
ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో భేటీ


