రోడ్డు పనులకు మోక్షమెన్నడో? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పనులకు మోక్షమెన్నడో?

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

సాక్షి,బళ్లారి: నిత్యం వాహనాల రాకపోకలు, జనం రద్దీగా తిరిగే రోడ్డు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బళ్లారి నుంచి ఆంధ్రాళ్‌ మీదుగా బొమ్మనహాళు వెళ్లే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన రహదారి అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతుండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. 10 కిలో మీటర్ల రోడ్డు పనులకు రూ.30 కోట్ల నిధులు విడుదల చేశారు. 6 నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఆంధ్రాళ్‌ నుంచి బైపాస్‌ వరకు నాలుగు లైన్ల రోడ్డు, మిగిలిన 8 కిలో మీటర్లు కర్ణాటక పరిధిలోని బుర్రనాయకనహళ్లి వరకు 12 బ్రిడ్జిలతో పాటు సిమెంట్‌ రోడ్డు వేయాలని ప్రభుత్వం నివేదిక రూపొందించి ఆదేశాలు జారీ చేసింది. సిమెంట్‌ రోడ్డు వేయడానికి రూ.30 కోట్ల నిధులను విడుదల చేసింది. దారి పొడవున రోడ్డు తవ్వేశారు. కంకర పరిచారు. ఎక్కడపడితే అక్కడ అధ్వానంగా రోడ్డును వదిలేశారు.

సీసీ రోడ్డుకు బదులు తారు రోడ్డు నిర్మాణం

సిమెంట్‌ రోడ్డు కోసం నిధులు విడుదల చేస్తే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ఏం ఆలోచన వచ్చిందో కానీ తారు రోడ్డు వేయాలని సంకల్పించారు. దీంతో ప్రభుత్వం అనుమతి కోసం ప్రతిపాదనలు పంపి పనులు ఆపివేశారు. నాలుగు నెలల నుంచి ఈ రోడ్డు అధ్వానంగా ఉండటంతో బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు 9 కిలోమీటర్ల పొడవైన రోడ్డును దాటేందుకు గంట సేపు ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి నుంచి ఈ రోడ్డు గుండా కర్ణాటక పరిధిలోని వివిధ పల్లెలకే కాకుండా ఆంఽధ్రప్రదేశ్‌ పరిధిలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణం సాగిస్తుంటారు. ముఖ్యంగా బళ్లారి నుంచి పావగడ, మడికేరి, తుమకూరు, బెంగళూరు వరకు కూడా ఈ రోడ్డు గుండానే నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. కేఎస్‌ఆర్‌టీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు బళ్లారి నుంచి బెంగళూరుకు నిత్యం రాకపోకలు సాగిస్తాయి.

పనుల్లో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి

ఇంత పెద్ద ఎత్తున రద్దీ గల ప్రధాన రహదారి అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సింది పోయి నెలల తరబడి 9 కిలో మీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులకు ఎంతో సమయం వెచ్చించాల్సి వస్తుండటంతో అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు గుండా వెళ్లేటప్పుడు సమయం అధికంగా తీసుకోవడంతో విపరీతమైన దుమ్ము, దూళి లేస్తుండటంతో ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. సీసీ రోడ్డుకు నిధులు మంజురు అయితే తారు రోడ్డు వేసేందుకు ఎందుకు వెచ్చిస్తున్నారో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిమెంట్‌ రోడ్డు పేరుతో నిధులు మంజూరు అయిన తర్వాత తారు రోడ్డు వేసేందుకు మళ్లీ ప్లాన్‌ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారు రోడ్డు కానీ సిమెంట్‌ రోడ్డు కానీ ఏదైనా ముందే ప్రతిపాదనలు చేసి ఆ దిశగా పనులు చేసి ఉంటే త్వరతగతిన పనులు పూర్తి చేసే అవకాశం ఉండేదని చెప్పవచ్చు. ఇకనైనా సంబంధిత అధికారులు నత్తనడకన సాగుతున్న రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

అధ్వానస్థితిలో ఉన్న కర్ణాటక, ఆంధ్ర ప్రధాన రహదారి దృశ్యం

వాహన రాకపోకలతో రోడ్డులో దుమ్ము, ధూళి లేస్తున్న దృశ్యం

ఆంధ్రాళ్‌ నుంచి 10 కి.మీ.మేర రూ.30 కోట్లతో రోడ్డు పనులు

అధ్వానస్థితిలోని రోడ్డుతో నానాఇబ్బందులు పడుతున్న ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement