బళ్లారిఅర్బన్: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది విరుపాక్షరెడ్డి(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన స్థానికంగా న్యాయవాదిగా, ఉపాధ్యాయుడిగా ఎంతో ఆదరణ పొందారు. ఈయన లాతో పాటు బీఈడీ పట్టభద్రులు. స్వస్థలం గుంతకల్లు సమీపంలోని కసాపురం. ఈయన సతీమణి బీఎస్‌ఎన్‌ఎల్ సీనియర్ ఉద్యోగి. ఈ దంపతులకు ఏకై క కుమారుడు ఇంజనీర్. తొలుత ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేసిన విరుపాక్షరెడ్డి ఆ తర్వాత లా పట్టా పుచ్చుకొని ప్రైవేట్ శిక్షణ తీసుకున్నారు. వివిధ సామాజిక సమస్యలపై పోరాటాలు సాగించిన మృతుని అంత్యక్రియలు వారి స్వస్థలం కసాపురంలో శనివారం నెరవేరాయి. ఈయన మృతికి పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ న్యాయవాది ఎస్.ఎర్రిస్వామి, జయరాం తదితరులు సంతాపం తెలిపారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు సెలవులివ్వాలి
రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలకు వేసవిలో అధికంగా ఎండలు ఉండడంతో అదనంగా 15 రోజులు సెలవులివ్వాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు 15 రోజులు అదనంగా సెలవులు ఇవ్వాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
వైభవంగా లక్ష్మీ వేంకటేశ్వర ఉత్సవాలు
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దిన్నిలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ వేడుకలో భాగంగా వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు.
సమస్యలు పరిష్కరించరూ
రాయచూరు రూరల్: నగరంలోని లాల్ బహుద్దూర్ శాస్త్రి నగరలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏఐఎంఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. శనివారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఉస్మాన్ మాట్లాడుతూ నూతన ఆశ్రయ కాలనీలోని మురుగు కాలువల్లో పేరుకున్న పూడికతీత, వీధుల్లో విద్యుత్ దీపాల అమరిక, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ధర్మ సందేశాలు అందరికీ చాటాలి
రాయచూరు రూరల్: భారత దేశంలో హిందూ ధర్మ సందేశాలను అందరికీ చాటాలని మాజీ మంత్రి శివన గౌడ నాయక్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం రాత్రి కిల్లే బృహన్మఠంలో పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య 31వ పట్టాధికార మహోత్సవంలో మాట్లాడారు. సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై ధర్మ ప్రచారంలో స్వామీజీ ముందంజలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తిప్పరాజ్, బసనగౌడ బ్యాగవాట్ పాల్గొన్నారు.
మలేరియాను నిర్మూలిద్దాం
రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నిర్మూలనకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ అధికారి డాక్టర్ సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. శనివారం లింగసూగూరు తాలుకా ఈచనాళ తాండాలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ శాఖ, తాలూకా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ మలేరియా వ్యాధి గురించి వివరించి, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. రక్త పరీక్ష ద్వారా వ్యాధిని కనుగొనడాినికి వీలుంటుందన్నారు.


