పాలికె విభజనకు రాజకీయ రంగు | - | Sakshi
Sakshi News home page

పాలికె విభజనకు రాజకీయ రంగు

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

హుబ్లీ: హుబ్లీ ధార్వాడ పాలికెను విభజించి ప్రత్యేక ధార్వాడ పాలికె ఏర్పాటు చేసే నిర్ణయం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. 16వ ఆర్థిక కమిషన్‌ నిధుల ఆశ కోసం బీజేపీ బృహత్‌ పాలికెగానే ఉండాలని పట్టుపడుతోంది. కాదు కూడదు అంటే విభజనే మంచిదని కాంగ్రెస్‌ మొండికేస్తోంది. ఈ ఇరువర్గాల రాజకీయ ఎత్తుగడలతో జంట నగరాల అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్తర కర్ణాటకలో ప్రముఖ జంట నగరాలైన హుబ్లీ– ధార్వాడ సిటీ కార్పొరేషన్‌ భవితపై రాజకీయ సంఘర్షణ పతాక స్థాయికి చేరింది. ఓ సమయంలో పాలికె విభజనకు పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడేమో ఎక్కువ నిధులు వస్తాయన్న ఆశతో గ్రేటర్‌ హుబ్లీ ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రచన కోసం డిమాండ్‌ చేస్తోంది. అయితే కాంగ్రెస్‌ మాత్రం పాలికె విభజన నిర్ణయానికే మొగ్గు చూపుతోంది. 1962లో హుబ్లీ ధార్వాడ నగరసభలను విలీనం చేసి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది 202.3 చదరపు కిలో మీటర్ల పరిధిలో 82 వార్డులను కలిగి ఉంది. అయితే నిధుల కేటాయింపులో ధార్వాడకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఎమ్మెల్యే అరవింద బెల్లద ప్రత్యేక ధార్వాడ కార్పొరేషన్‌ డిమాండ్‌కు శ్రీకారం చుట్టారు.

గవర్నర్‌ అనుమతి కోసం ఎదురుచూపులు

కాగా 2025 జనవరిలో విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ కోసం పంపించింది. ఇలా ఉండగా బీజేపీ వైఖరి మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం తీర్మానం ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీ కార్పొరేషన్లకు వార్షికంగా రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల మేర ఎక్కువ నిధులు ఇవ్వడానికి సిఫార్సు చేసింది. ఒక వేళ పాలికె విభజన జరిగితే రెండు నగరాల జనాభ 10 లక్షల కన్నా తక్కువ కానుంది. దీంతో ఈ పెద్ద నిధి చేజారుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పాలికె సమావేశంలో విభజనకు గుడ్‌ బై చెప్పి బృహత్‌ పాలికె ఏర్పాటుకు తీర్మానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బీజేపీ నేతల ఈ వైఖరిని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రసాద్‌ అబ్బయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న గ్యారంటీ లేదు. కేంద్రం నియమావళికి మన పాలికెను అన్వయించడం అనుమానమే. దీంతో విభజనే మంచిదని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఈ గందరగోళాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఏ తీర్మానం తీసుకుంటుందోనని ప్రస్తుతం అందరిలో కుతూహలం కల్గిస్తున్న అంశం.

బృహత్‌ పాలికె కోసం బీజేపీ పట్టు

విభజనే ముద్దు అంటున్న కాంగ్రెస్‌

ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రభుత్వం తీరు

Advertisement
 
Advertisement
Advertisement