బళ్లారిటౌన్: ట్రాన్స్‌జెండర్ల(హిజ్రాల)కు కూడా అన్ని శాఖల్లోను ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయడమే కాక ఉత్తమ జీవితం సాగించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కర్ణాటక స్వాభిమాన నడక కన్వీనర్ వీణా డిమాండ్ చేశారు. శనివారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 4న ఉదయం 11 గంటలకు మోతీ సర్కిల్ నుంచి గాంధీ భవన్ వరకు స్వాభిమాన నడకను చేపట్టి అనంతరం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. సమాజంలో తమను చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాము ఏ వృత్తిలో జీవించాలో ప్రభుత్వాలు దారి చూపాలన్నారు. తమకు సరైన సదుపాయాలు కల్పించక పోవడంతో విధి లేక భిక్షాటన చేస్తున్నామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా తమపై కొత్త చట్టం తీసుకొని రావడం గోరుచుట్టుపై రోకలి పోటుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయలేదని, కర్ణాటకలోను ఈ చట్టాన్ని అమలు చేయరాదని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాక అన్ని శాఖల్లో కేటాయించిన 1 శాతం రిజర్వేషన్‌ను అమలు అయ్యేలా ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమితి ప్రముఖులు చాందిని, చంద్రకుమారి, పర్వీన్ బాను, గౌసియా బేగం, అరుణ, హేమలత తదితరులు పాల్గొన్నారు.


