రాజధానిలో షరా మామూలే.! | - | Sakshi
Sakshi News home page

రాజధానిలో షరా మామూలే.!

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

బనశంకరి: బెంగళూరు నగరంలో ప్రతి ఏడాది భారీవర్షాలకు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కోవడం షరా మామూలుగా మారుతోంది. సిలికాన్‌సిటీలో ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయనే దానిపై గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార, నగర పాలికె అధికారులు గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రతి సారీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఏయే ప్రదేశాల్లో ఎలాంటి సమస్య తలెత్తుతుంది అనే దాని గురించి గత ఐదారేళ్ల నుంచి బీబీఎంపీ, జీబీఏ జాబితా తయారు చేసింది. 209 స్థలాలను ముంపుప్రాంతాలుగా గుర్తించింది. ఇందులో 49 ప్రదేశాల్లో ఇంకా సమస్య కొనసాగుతోందని ఏప్రిల్‌ 2వ తేదీన గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార ఆదేశాల్లో తెలిపింది. వర్షాలు పడిన సమయంలో వరదల నియంత్రణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుని ఎలాంటి సమస్య ఏర్పడకుండా అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని జనవరి నుంచి నగర పాలికెలకు జీబీఏ సూచించింది. ఏయే పనులు ఎవరు చేయాలన్నదానిపై మార్గదర్శకాలు సిద్ధం చేసింది. కానీ వర్షం వచ్చేలోపు ఈ పనులు పూర్తి కావడం లేదు.

వరద నివారణ మార్గదర్శకాలపై ఆదేశాలు

భారీ వర్ష సూచన, వరద నివారణ మార్గదర్శకాలపై ఏప్రిల్‌ 30వ తేదీన జీబీఏ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఐదు నగర పాలికెల కమిషనర్లు, జీబీఏ అధికారులు వర్షాలపై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చేసిన సూచనల్లో 50 శాతం అమలు చేస్తే నగరంలో వర్షంతో ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదు. ఒకగంట భారీ వర్షం కురిసిందని కబుర్లు చెబుతున్నారు. కానీ అన్ని విధాలుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని రెండు వారాల క్రితం తెలిపిన అధికారులు ప్రస్తుతం ఎలా సమర్థించుకుంటారు? అనే ప్రశ్న తలెత్తింది. బెంగళూరు నగరంలో కొత్త కట్టడాల్లో ఒక గోడ అదనంగా నిర్మిస్తే మూడో కంటి ద్వారా తెలుసుకునే ఇంజనీర్లకు తమ పరిధిలో శిథిలమైన కట్టడాలు, గోడలు గురించి తెలియదా? ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే బౌరింగ్‌ ఆసుపత్రి ప్రహరీగోడ కూలిపోయే దుర్ఘటన తప్పేదేమో? అనే ప్రశ్న ఎదురవుతోంది. అది ప్రైవేటు లేదా పాలికెకు సంబంధం లేదని చెప్పవచ్చు కానీ జవాబుదారీ నగర పాలికెది కదా? అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.

బాధ్యత తీసుకుంటే నష్టనివారణ సాధ్యం

భారీ వర్షాలకు చెట్లు కూలిపోవడం, చెట్ల కొమ్మలు విరిగిపోతే వాటిని అత్యవసరంగా తొలగించడానికి బృందాన్ని ఏర్పాటు చేయాలి. నగర ప్రజల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలి. చెట్లలో ఎండిపోయిన, కూలిపోయే దశలో ఉన్న చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్‌ చేసి తొలగించడంపై జీబీఏ అటవీ విభాగ ప్రత్యేక కమిషనర్‌ బాధ్యత వహించాలి. కానీ వీటిపై చర్యలు తీసుకుంటే గత నెల 29వ తేదీన కురిసిన వర్షానికి చెట్లు కూలిపోతే నష్టం సంభవించేది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. వర్షాలతో సమస్య నివారణకు కొత్తగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం లేదు. బీబీఎంపీ లేదా జీబీఏ గతంలో రూపొందించిన పథకాలను అమలు చేస్తే 2026 జనవరి నుంచి ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలు పాటిస్తే భారీ వర్షానికి ఇలాంటి ఇబ్బంది తలెత్తేది కాదు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందు అవసరమైన చర్యలు అత్యవసరంగా జీబీఏ, ఐదు నగర పాలికెలు చేపడితే ప్రమాదాల నుంచి తప్పించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బౌరింగ్‌ ఆసుపత్రి వద్ద కూలిన ప్రహరీగోడ (ఫైల్‌)

ఉద్యాననగరిలో భారీ వర్షానికి ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌

గత కొన్ని నెలలుగా జీబీఏ చేస్తున్న సూచనలు

రోడ్ల పక్కన డ్రైనేజీలు, రాజ కాలువల్లో పూడిక, చెత్త, వ్యర్థాలను తొలగించాలి

డ్రైనేజీలు, రాజకాలువల్లో తీసిన పూడిక మట్టిని తరలించాలి

రోడ్లపై వర్షం నీరు సజావుగా డ్రైనేజీల్లో ప్రవహించడానికి కర్చ్‌ ప్రవేశాల్లో గ్రేటింగ్‌, అండర్‌పాస్‌ గ్రేటింగ్‌ శుభ్రం చేయాలి

డ్రైనేజీ చాంబర్లను శుభ్రం చేసి నీరు సజావుగా ప్రవహించడానికి చర్యలు తీసుకోవాలి

ప్రాథమిక, ద్వితీయ స్థాయి రాజ కాలువల్లో పూడిక తీసి ఆధునీకరించాలి.

భారీ వర్షం కురిస్తే సిలికాన్‌ సిటీ

అస్తవ్యస్తం

ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం

Advertisement
 
Advertisement
Advertisement