మాదప్ప స్వామికి రూ. 3.13 కోట్ల కానుకలు | - | Sakshi
Sakshi News home page

మాదప్ప స్వామికి రూ. 3.13 కోట్ల కానుకలు

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

మైసూరు: చామరాజనగర్‌ జిల్లా, హనూర్‌ తాలూకాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహదేశ్వర బెట్టలో వెలసిన శ్రీ మలే మహదేశ్వర స్వామికి భక్తుల నుంచి కానుకల వర్షం కురిసింది. 33 రోజులకు సంబంధించి ఆలయంలోని హుండీలు లెక్కించగా రూ. 3,13,12,118 కానుకలు స్వామివారికి లభించాయి. దీంతోపాటు 64 గ్రాముల బంగారం, 2 కిలోల 50 గ్రాముల వెండి, చలామణిలో లేని రూ. 2వేల విలువైన 3 నోట్లు, 4 విదేశీ నోట్లను లభించాయి. ఆన్‌లైన్‌ హుండీ ద్వారా 6,88,214 ఆదాయం లభించింది. సాలూరు బహన్‌ మఠం అధ్యక్షుడు శ్రీ శాంత మల్లికార్జున స్వామిజీ, శ్రీ మలే మహదేశ్వర స్వామి ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యదర్శి ఎ. ఇ. రఘు సమక్షంలో హుండీలను లెక్కించారు. జిల్లా పరిపాలన కార్యాలయ అథారిటీ డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్‌ భారతి పాల్గొన్నారు.

లైంగిక వేధింపులు..

నిందితుడి అరెస్టు

దొడ్డబళ్లాపురం: ట్రైనీ ఎయిర్‌ హోస్టెస్‌ని లైంగికంగా వేధిస్తున్న నిందితుడిని బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. చంద్రశేఖర్‌ అరైస్టెన నిందితుడు. బాధిత యువతి ఎయిర్‌ హోస్టెస్‌గా ట్రైనింగ్‌లో ఉంది. నిందితుడు ఆమెకు పరిచయస్తుడే. ఒకే ప్రాంతంలో నివసించేవారు. దీంతో అతడితో తరచూ మాట్లాడేది. దీన్నే అలుసుగా తీసుకున్న చంద్రశేఖర్‌ ప్రేమించమంటూ వెంటబడేవాడు. దీంతో అతడ్ని పూర్తిగా దూరం పెట్టడంతో లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. రోడ్డుపై వెళ్తుండగా తాకడం లాంటివి చేసేవాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పరప్పన నుంచి భార్యకు విచారణఖైదీ వీడియోకాల్‌

బనశంకరి: పరప్పన అగ్రహార జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం అనుభవించడం కొత్తేమీ కాదు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఖైదీలు మాత్రం తమ ఇష్టానుసారంగా జీవనం సాగిస్తున్నారు. విచారణఖైదీ సెల్‌లో కూర్చుని భార్యకు వీడియోకాల్‌ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణఖైదీ అక్బర్‌ జైలు అధికారుల కళ్లుగప్పి మొబైల్‌ వాడుతున్నట్లు తెలిసింది. ఇతను జైలులోని తన గదిలో నుంచి భార్యకు వీడియోకాల్‌ చేశాడు. భార్య ఆ వీడియో కాల్‌ను రికార్డ్‌ చేసి గత నెల 9వ తేదీన తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఏప్రిల్‌ 28వ తేదీ అక్బర్‌ జైలునుంచి విడుదలయ్యాడు. అతను విడుదలైన వీడియోను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కాగానే ఇన్‌స్టా నుంచి వీడియోను డిలీట్‌ చేశారు. పరప్పన అగ్రహార జైలులో ఇలాంటి అక్రమాలు కొత్తేమీ కాదని, గత కొన్నేళ్లుగా ఆ జైలు విలాసవంతమైన సౌకర్యాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మలే మహదేశ్వర బెట్ట రోడ్డుపై బస్సు బోల్తా

30 మందికి గాయాలు

మైసూరు: చామరాజనగర్‌ జిల్లా, హనూర్‌ తాలూకాలోని మలే మహదేశ్వర బెట్ట నుంచి శుక్రవారం 50 మంది ప్రయాణికులతో కొల్లేగాళు బయల్దేరిన కేఎస్‌ ఆర్టీసీ బస్సు తాలుబెట్ట మలుపు వద్ద బ్యారియర్‌ సమీపంలో బోల్తా పడింది. దీంతో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు స్పందించి ప్రయాణికులను, క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. కండక్టర్‌ పద్మావతి, మైసూరుకు చెందిన దాక్షాయణి, సిద్దయ్యనపురకు చెందిన సుందరమ్మ బసవరాజుకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను కౌడల్లి, హనూర్‌, కొల్లేగాళు ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తుండగా హెచ్చరించామని, అయినా డ్రైవర్‌ పట్టించుకోలేదని ప్రయాణికులు మండిపడ్డారు. బస్సు బోల్తా పడుతుండగానే డ్రైవర్‌ కిందకు దూకి పారిపోయాడు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను సులభతరం చేశారు.

బస్సు ఢీకొని విద్యార్థి మృతి

దొడ్డబళ్లాపురం: బస్సు ఢీకొని విద్యార్థి మృతిచెందిన ఘటన హెణ్ణూరు–బాగలూరు మెయిన్‌ రోడ్డులో చోటుచేసుకుంది. 9వ తరగతి పాస్‌ అయిన వరుణ్‌(15) ఇంటి నుంచి రోడ్డు అవతలి వైపు ఉన్న షాప్‌కి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొంది. ప్రమాదంలో వరుణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.హెణ్ణూరు ట్రాఫిక్‌ పోలీసులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement