బళ్లారిఅర్బన్: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి జనవరి 1న నగరంలో జరిగిన గొడవ, కాల్పుల కేసులో సీఐడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. గత నాలుగు రోజులుగా నగరంలో మకాం వేసిన డీఎస్పీ అంజన్‌కుమార్ నేతృత్వంలో సీఐడీ అధికారుల బృందం నగరంలోని అతిథిగృహంలో ఈ కేసులోని నిందితులను ప్రశ్నిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంతకు ముందు మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి మద్దతు ఉన్న నిందితులకు బెంగళూరుకు రావాలని నోటీసులు జారీ చేశారు. వారిలో కొందరు వెళ్లి అప్పుడు తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి వాంగ్మూలాలను నమోదు చేసుకొని వారిని ఆ బృందం ప్రశ్నించింది. వారు అనంతరం కోర్టుకు హాజరు కావాలని తెలిసింది. మరో వైపు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మద్దతు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మందికి పైగా వ్యక్తులను నగరంలోని ఎంఆర్‌వీ లేఔట్‌లో ఉన్న నిందితుడి ఇంటికి పిలిపించి నోటీసులు ఇచ్చారు. మే 11న బెంగళూరు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని వారికి సూచించారు. మొత్తం బ్యానర్ వివాదానికి సంబంధించిన కేసులపై త్వరలో చార్జిషీట్ సమర్పణకు సీఐడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
11న వాంగ్మూలం నమోదుకు సూచన
నోటీసులు జారీ చేసిన సీఐడీ బృందం


