రాయచూరు రూరల్: కర్ణాటక ప్రభుత్వం 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి శాలును కలబురగి నగర అదనపు పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బీఎస్ సంజయ్ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాలు.. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2021 బ్యాచ్‌లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో హోళి నరసిపురలో అదనపు ఎస్పీగా పని చేశారు. బెంగళూరులో సీఐడీలో ప్రత్యేక అధికారిగా ఉంటూ ఎస్పీగా విధులు నిర్వర్తించారు.
ఆకట్టుకున్న నృత్యాలు
హొసపేటె: తాలూకాలో కడ్డిరాంపుర తండాలో శ్రీసంత సేవాలాల్, మరియమ్మ దేవి జాతర శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. డీజే శబ్ధాలకు అనుగుణంగా యువతీ యువకులు నృత్యం చేశారు. బంజారా సముదాయానికి చెందిన ప్రత్యేక వస్త్రధారణ, మహిళల నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతకుముందు శ్రీసంత సేవాలాల్, మరియమ్మ దేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
పేలిన డీజిల్ ట్యాంక్
హొసపేటె: తాలూకా సండూర్ హుబ్లీలోని నందిహళ్లి సమీపంలో లారీ డ్రైవర్ మహమ్మద్ చిన్నపాటి మరమ్మతుల కోసం లారీని శుక్రవారం గ్యారేజీకి తీసుకెళ్లాడు. మరమ్మతుల అనంతరం లారీని యథావిధిగా బయటకు తీసుకొచ్చాడు. ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మహమ్మద్, క్లీనర్ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సండూర్‌లోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని ఓపీడీ ఆస్పత్రికి తరలించారు.
ఉత్తమ సేవలందించాలి
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఉత్తమ సేవలందించాలని జిల్లా అధికారి నితీష్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి పండిత సిద్ద రామ జంబలదిన్ని రంగ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలన్నారు. సర్కారీ ఉద్యోగులు సంఘటితంగా మెలగాలని సూచించారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించి వెనుకబడిన జిల్లా అనే పేరును తుడిచి వేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి, కమిషనర్ జుబీన్ మోహపాత్రో, అదనపు ఎస్పీ కుమార స్వామి, నగర సభ కమిషనర్ శరణప్ప, తహసీల్దార్ సురేష్ వర్మ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
13 బైక్‌లు స్వాధీనం
బళ్లారి అర్బన్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్‌ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండలం మాచనూరుకు చెందిన నిందితుడు బైక్‌ను దొంగలిస్తుండగా అరెస్ట్ చేశారు. గాంధీ నగర్, బ్రూస్‌పేట్ ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
బీఎస్సీ నర్సింగ్
విద్యార్థి ఆత్మహత్య
బనశంకరి: బెంగళూరు శివారులోని బొమ్మసంద్ర బీటీఎల్ కాలేజీ హస్టల్‌లో ఉంటున్న కేరళకు చెందిన ఏపీ.ఆదిత్య(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వితీయ సంవత్సవర బీఎస్సీ నర్సింగ్ చదువుతన్న ఇతను బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు చావుకు కాలేజీ పాలక మండలి కారణమని మృతుడి తండ్రి ప్రదీప్ హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
రెండు బైక్‌లు ఢీ.. ఒకరి మృతి
మండ్య: మండ్య జిల్లా హలగూర్ వద్ద శుక్రవారం రెండు బైక్‌లు ఢీకొని ఒక బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రామనగర జిల్లా చెన్నపట్న తాలూకా మడపుర గ్రామానికి చెందిన ముత్తురాజు (25)గా గుర్తించారు. ఇతను పని నిమిత్తం హలగూర్ నుంచి మాలవల్లి వైపు బైక్‌పై వెళ్తుండగా బెంగళూరు నుంచి వస్తున్న బైక్ ఎదురైంది. పరస్పరం ఢీకొనడంతో ముత్తురాజు అక్కడికక్కడే మృతి చెందాడు. హలగూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


