రాయచూరు రూరల్: కేంద్ర సర్కార్ అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శరణు బసవ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు. కార్మిక జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రతి నెల రూ.7,500 చొప్పున వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్నారు. అలాగే ఎస్‌యూసీఐ నాయకుడు వీరేష్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో పద్మ, సులోచన, వరలక్ష్మి, మహేష్, చెన్న బసవ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కార్మిక దినోత్సవం
హొసపేటె: తాలూకా న్యాయ సేవల కమిటీ, బార్ అసోసియేషన్, పోలీస్ శాఖ, కార్మిక శాఖ, విద్యా శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల సహకారంతో నగరంలోని టీఎంఏఈఎస్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీజేఎం, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి సుబ్రమణ్య, ఎన్, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, తాలూకా న్యాయ సేవా కమిటీ సభ్య కార్యదర్శి ప్రశాంత్ నాగలాపూర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుజ్జల నాగరాజ్, లేబర్ ఇన్‌స్పెక్టర్లు జీబీ.ధూపద్, శివశంకర్ తల్వార్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హొసపేటె: హొసపేట తాలూకాలోని శ్రామిక భవన్ ఎదుట సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు ఆర్.భాస్కర్ రెడ్డి జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. కోట్లాది మంది శ్రామిక ప్రజలను ఆకలి, పేదరికం, అవమానాల నుంచి విముక్తం చేయడానికి పోరాటం చేయాలన్నారు.ఈ మహత్తర పోరాటంలో ప్రపంచంలోని ఇద్దరు బడా పెట్టుబడిదారుల దోపిడీ, బానిసత్వం నుంచి కార్మికులు బయట పడాలన్నారు. సోదర భావం, స్వేచ్ఛా స్ఫూర్తితో ఒకరికొకరు అండగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు యాళ్లలింగ, జంబయ్య నాయక్, తాసప్ప, మహేష్, నాగరత్న తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి అర్బన్: అమ్మ శ్రీ కస్తూరి కన్నడ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లతో కలసి జెండా ఆవిష్కరించారు. ఆ సంఘం అధ్యక్షుడు ఏ జాన్‌బాస్కో మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు వందలాది మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో అమ్మ శ్రీ కస్తూరి ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే.వెంకటేష్, వెంకటేష్, సీఐ అన్వర్ బాషా, సయ్యద్, గంగాధర్, నూర్, శేఖర్, ధ్యానప్ప, ప్రసాద్, తారక్, యల్లప్ప, మహేష్, రాము, తదితరులు పాల్గొన్నారు.


