సాక్షి బళ్లారి: టీటీ వాహనాన్ని గూడ్స్ లారీ ఢీ కొట్టడంతో స్నేహితుడి పెళ్లికి బయలుదేరిన మిత్ర బృందంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కూడ్లిగి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి టాటా టెంపో (తుపాన్) వాహనంలో ఓ ప్రైవేటు కంపెనీ (రిలయన్స్ డిజిటల్)లో పని చేస్తున్న 12 మంది యువతీ యువకులు స్నేహితుడి పెళ్లి కోసం కూడ్లిగి సమీపంలోని హిరేగినళ్లికి బయలుదేరారు. కూడ్లిగి తాలూకా హిరేకడూరు వైపు వెళ్తుండగా టీటీ వాహనం రిపేరీతో ఆగిపోవడంతో రోడ్డు పక్కన నిలబెట్టారు. వాహనంలో మధు, దిలీప్ మరో ఐదుగురు అలాగే ఉండిపోయారు. మిగిలిన వారు కిందకు దిగి వాహనాన్ని తోసేందుకు ప్రయత్నించారు. అంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ లారీ.. టీటీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా టెంపో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. టెంపో వాహనంలో వెనుక సీట్లో కూర్చొన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కదరంపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రాధిక దంపతుల కుమారుడు పి.మధు అక్కడికక్కడే మృతి చెందాడు. హాసన్ జిల్లాకు చెందిన మరో యువకుడు దిలీప్ బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఐదుగురు గాయాలపాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే డీవైఎస్పీ మల్లేష్‌దొడ్డమణె, సీఐ ప్రహ్లాద చెన్నగిరి, పీఎస్‌ఐ ప్రకాశ్, తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కదరంపల్లిలో విషాదచాయలు..
ఇదిలా ఉండగా.. కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం కదరంపల్లికి చెందిన పి.మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో రెండు వాహనాల్లో బంధువులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు. మధు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
బైక్‌ను ఢీకొన్న లారీ
● బైక్ చోదకుడు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణ శివారులోని హోసహళ్లి రోడ్డుపై ఉన్న ఫ్లైఓవర్ అండర్ పాస్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది.
తీవ్ర గాయాలపాలైన బైకర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. సౌత్ సీడ్స్ కంపెనీలో పని చేస్తున్న సులదాహళ్లికి చెందిన బసవరాజ (35) మృతుడు. వివరాలు.. బసవరాజ సులదాహళ్లి నుంచి కూడ్లిగి పట్టణానికి వెళ్లాడు. అక్కడ సామాను తీసుకుని కూడ్లిగి పట్టణంలోకి వెళ్లాడు. కొత్త గ్రామం నుంచి కూడ్లిగి పట్టణం వైపు వస్తున్న లారీ డ్రైవర్.. ఫ్లైఓవర్ అండర్‌పాస్ రోడ్డుపై వేగంగా వచ్చి.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బసవరాజ తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. సోదరుడు రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లారీ డ్రైవర్‌పై కూడ్లిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
టీటీ వాహనాన్ని ఢీ కొట్టిన గూడ్స్ లారీ
ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
బెంగళూరు నుంచి కూడ్లిగికి
వెళ్తుండగా ఘటన
మృతుల్లో ఒకరు కళ్యాణదుర్గం తాలూకా నివాసి
మరొకరు హాసన్ జిల్లా యువకుడు
బసవరాజు
మృతదేహం


