రింగ్‌ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రింగ్‌ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి

May 1 2026 6:15 AM | Updated on May 1 2026 6:15 AM

రాయచూరు రూరల్‌: నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రహదారులను విస్తరించడంతో పాటు రింగ్‌ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఏపీఎంసీ ఉపాధ్యక్షుడు బాబురావ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారీ వాహనాలు ప్రధాన రహదారిపై వెళ్తున్న సమయంలో ఇటీవల ముగ్గురు మరణించారని పేర్కొన్నారు. దేవ సూగురు నుంచి నవోదయ వైద్య కళాశాల వరకు రింగ్‌ రోడ్డు నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్‌డీఏ అధ్యక్షుడు రాజశేఖర్‌ రామస్వామికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు కూలీ మృతి

రాయచూరురూరల్‌: కల్యాణ కర్ణాటకలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బకు కూలీ మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం సింధనూర్‌ తాలూకా ఇజె మూళ్లూరుకు చెందిన వ్యవసాయ కూలీ అంబణ్ణ (62)గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్న సమయంలో నరేగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో బీపీ పెరగడంతో కుప్ప కూలిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వారం రోజుల్లోనే ఐదుగురు వడదెబ్బతో మృతి చెందారు.

పిడుగుపాటుకు ఎద్దులు మృతి

లింగసూగురు తాలూకా ముదుగల్‌ మేగళ పేటలో పిడుగుపాటుకు ఎద్దులు మరణించాయి. బుధవారం సాయంత్రం హనుమంతు ఎద్దులను కట్టేసి వచ్చాడు. సాయ్రంతం పిడుగులు పడటంతో ఎద్దులు చనిపోయాయి.

బౌద్ధ సన్యాసి హత్య

హుబ్లీ: టిబెట్‌కు చెందిన బౌద్ధ సన్యాసి థాసిదొండు (39) దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ధార్వాడ బైపాస్‌ అలియాళ రోడ్డులో వంతెన వద్ద చోటు చేసుకుంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే ధార్వాడ గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. అతడి ముఖంపై గాయాలైనట్లు కనుగొన్నారు. బౌద్ధ సన్యాసి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. దుండగులు వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి మృతుడి బంధువులు, ధార్వాడ గ్రామీణ పోలీసులు అలాగే ముండగోడ పోలీసులు వచ్చి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.

గుండెపోటుతో ఉద్యోగి మృతి

హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న అకౌంటింగ్‌ అధికారి విజయ కుమార్‌ (40) గుండెపోటుకు గురై మరణించారు. గురువారం ఉదయం విజయకుమార్‌ యథావిధిగా కార్యాలయానికి వచ్చారు. విధులు నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుర్చీలోనే కుప్పకూలి పోయారు. ఇతర కార్యాలయ సిబ్బంది దీనిని గమనించి విజయ్‌కుమార్‌తో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే ఆయన స్పందించక పోవడంతో హుటాహుటిన పట్టణంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే విజయ్‌కుమార్‌ చనిపోయారు.

నిరంతరాయంగా

అభివృద్ధి పనులు

హుబ్లీ: 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ సువర్ణ కల్లకుంట్ల తమ వార్డులో సమస్యల పరిష్కారానికి సాయశక్తుల కృషి చేస్తున్నారు. తాజాగా వార్డు పరిధిలోని గ్రీన్‌ వ్యాలీ లేఅవుట్‌లో రూ.19 లక్షల వ్యయంతో రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యనగర్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రజత్‌ ఉల్లగడ్డి మఠ మాట్లాడుతూ.. ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహణ, ఇతర సహాయ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. కాగా రూ.19 లక్షల ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ, వివిధ అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.

పరిహారం పంపిణీ

రాయచూరు రూరల్‌: మూడు రోజల క్రితం పిడుగుపాటుతో 50 గొర్రెలు మృతి చెందిన విషయం విదితమే. బుధవారం సాయంత్రం గురుమిఠకల్‌ శాసన సభ్యుడు శరణ గౌడ కందకూరు కుటుంబాలను పరామర్శించారు. గురుమిఠకల్‌ తాలుకా బదూరులో రూ.5 లక్షల చెక్కు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement