బళ్లారి రూరల్: బీఎంసీఆర్‌లో డాక్టర్ మంజునాథ్ సేవలు మరువలేనివని బీఎంసీఆర్‌సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధర గౌడ తెలిపారు. గురువారం బీఎంసీఆర్‌సీ వైద్య భవన్‌లో డాక్టర్ మంజునాథ్ ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గంగాధర గౌడ మాట్లాడుతూ.. ఈఎన్‌టీ విభాగ ప్రముఖుడు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్ శాంత స్వభావుడు అని తెలిపారు. ఈఎన్‌టీ విభాగంలో సదస్సులు, సమ్మేళనాలు, ఆధునిక వైద్యాన్ని తీసుకొచ్చి ఆ విభాగానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. రాజీయ పలుకుబడి కుటుంబ నేపథ్యం ఉన్నా తాను సామాన్య వైద్యుడిలా బాధ్యతలను నిర్వర్తించారని తెలిపారు. డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కోరిక మేరకు వైద్య వృత్తి స్వీకరించడం జరిగిందన్నారు. ఉత్తమ జీవితాన్ని ప్రసాదించిన తన పెద్దనాన్న, గురువులకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం డాక్టర్ మంజునాథ్ దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో బీఎంసీఆర్‌సీ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ చిదంబర మూర్తి, ట్రామాకేర్ సెంటర్ సూపరిన్‌టెండెంట్ డాక్టర్ శివనాయక్, టీబీ శానిటోరియం సూపరింటెండెంట్ డాక్టర్ మురుగేశ్, బీఎంసీఆర్‌సీ వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.


