బనశంకరి: బెంగళూరు శివాజీనగరలో బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీగోడ కూలిపోయి 7 మంది మృత్యువాత పడిన ఘటనను తీవ్రంగా పరిగణించి సుమోటో కేసు నమోదు చేశామని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బీఎస్.పాటిల్ తెలిపారు. గురువారం ప్రమాదస్థలిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కేసులో కిందిస్థాయి సిబ్బందినే కాకుండా ఉన్నతస్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్‌తో పాటు ముఖ్యమైన అధికారులను బాధ్యులుగా చేస్తామని చెప్పారు. పాలనా వ్యవస్థ నిర్లక్ష్యంపై బీఎస్.పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహరీ పునాది పూర్తిగా శిథిలం కావడమే ఈ ఘోరానికి ప్రధాన కారణమన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినప్పటికీ ఇలాంటి శిథిలమైన గోడ పక్కన వీధి వ్యాపారులను అనుమతించడం అధికారుల నిర్లక్ష్యమన్నారు. బౌరింగ్ ఆసుపత్రి ఇన్‌చార్జ్ హరీశ్‌కుమార్‌ను మొదట విచారిస్తామన్నారు. అలాగే జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్, వైద్యవిద్యశాఖ కమిషనర్, ఐదు పాలికెల కమిషనర్లను చేర్చి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
వైద్య విద్యామంత్రి తనిఖీ
వైద్య విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రి ప్రహరీ కూలిందనే విమర్శలు వెల్లువెత్తాయి. పాత, కొత్త ప్రహరీగోడలు నాణ్యత పట్ల ప్రస్తుతం తీవ్ర అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైద్య విద్యశాఖామంత్రి శరణప్రకాష్ పాటిల్ బౌరింగ్ ఆసుపత్రి వద్ద ప్రమాదస్థలిని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను పరామర్శించారు. బెంగళూరు నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రహరీలు, సౌకర్యాలపై తనిఖీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఈ దుర్ఘటనతో బెంగళూరు ప్రభుత్వ ఆస్పత్రులు, భవనాల భద్రతపై ప్రజల్లో భయాందోళనలు పెచ్చుమీరాయి.
ఇంజినీర్ సస్పెండ్
సీఎం సిద్దరామయ్య గోడ ప్రమాదంపై విధానసౌధలో సమావేశం నిర్వహించారు. బౌరింగ్ ఆసుపత్రి చీఫ్‌పై మండిపడ్డారు. ఆయనకు నోటీస్ జారీచేయాలని చీప్ సెక్రటరీని ఆదేశించారు. ఆస్పత్రి ఇంజినీర్ ను సస్పెండ్ చేశారు. గోడ దెబ్బతినేలా అక్కడ మట్టి ఎందుకు వేశారని, మీరు ఎందుకు పరిశీలించలేదని ఇంజినీర్‌ను ప్రశ్నించారు.
ప్రధాని సంతాపం
ప్రహరీగోడ మృతులకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ పరిహార నిధి నుంచి తలా రూ.2 లక్షలు, గాయపడినవారికి తలా రూ.50 వేలు సహాయం అందిస్తామని ఎక్స్‌లో తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కమిషనర్లపై కేసు
లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్


