హుబ్లీ: పోలీసుల వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కేసుకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. హెడ్‌కానిస్టేబుళ్లు చంద్రు నడువినమని, కిరణ్ డొక్కణ్ణవర్, సయ్యద్ తహసీల్దార్ సస్పెండ్‌కు గురైన పోలీసు సిబ్బంది. ధార్వాడ విద్యాగిరి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఆ ముగ్గురు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ధార్వాడ గిరినగర ఇంట్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతుడు ఆదిత్య మ్యాగేరి ధార్వాడలో బీఎస్సీ చదివేవాడు. స్వస్థలం బాగలకోటె జిల్లా బాదామి తాలూకా బేలూరు గ్రామం ధార్వాడ కిటిల్ కళాశాలలో బీఎస్సీ చదువుతూ గిరినగరలో తన స్నేహితుల అద్దె గదిలో ఉండేవాడు. గంజాయి డ్రైవ్ సందర్భంగా మృతుడు ఆదిత్యతో పాటు కొందరు విద్యార్థులను గంజాయి సేవనం ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకొని పరీక్ష జరపగా మృత విద్యార్థి పరీక్ష నివేదిక నెగిటివ్‌గా వచ్చింది.
విద్యార్థుల నుంచీ లంచాలు
అయినా కూడా పోలీసులు తమ వక్రబుద్ధిని ప్రదర్శించి విద్యార్థుల నుంచి వివిధ రూపాలతో లంచాలు తీసుకున్నారు. దీంతో సదరు ఆదిత్య కూడా తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి తల్లికి ఫోన్ చేసిన ఆదిత్య రూ.2000 ఫోన్‌పే ద్వారా పంపమని అడిగాడు. అయితే తల్లి డబ్బులు ఫోన్‌పే చేయలేదు. దీంతో పోలీసులు డబ్బుల కోసం మళ్లీ వేధిస్తారని ఆందోళనతో ఒత్తిడికి గురైన ఆదిత్య ఆరోజు రాత్రి గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బిడ్డ చావుకు పోలీసులే కారణమని ఆదిత్య తల్లి కవిత మ్యాగేరి ఆరోపించారు. ఆదిత్య ఇచ్చిన సమాచారం మేరకు విద్యాగిరి పోలీసులు ఇద్దరు పెడ్లర్లను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సదరు గంజాయి డ్రైవ్ వేళ ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవించినట్లు ధృవ పడటంతో వారిపై కేసు నమోదు చేశారు.
ముగ్గురు లంచగొండి ఖాకీలపై సస్పెన్షన్ వేటు
లంచం ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారుల చర్య
తప్పుడు సందేశం పోరాదని వేటు
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ మృత విద్యార్థి తల్లిదండ్రులు యూడీఆర్ ఫిర్యాదు చేశారు. అంతేగాక డ్రగ్స్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా పోలీసులు రూ.2000 లంచం అడిగారని తల్లిదండ్రులు ఆరోపించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తప్పుడు సందేశం పోరాదన్న క్రమంలో బాధ్యులైన ఆ పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశామన్నారు. కేసును లా అండ్ ఆర్డర్ డీసీపీ శృతి దర్యాప్తు చేపట్టారు. సమగ్ర దర్యాప్తు జరిపి లోటుపాట్లు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా విద్యార్థి ఆదిత్య పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అయ్యాక మృతదేహాన్ని సొంత ఊరు బాగలకోటకు తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో వారి స్థానిక బంధువు ఆర్థికంగా సహాయం అందించి అంబులెన్స్‌లో ఆదిత్య శవాన్ని తరలించినట్లు తెలిసింది. కాగా ఉన్న ఒక్క కుమారుడిని పోలీసుల లంచం దాహం బలిగొందని ఆదిత్య తల్లి కవిత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.


