హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతిలో డైలీ మార్కెట్, గణేష్ సర్కిల్, గాంధీ సర్కిల్ తదితర ప్రాంతాలతో సహా నగరంలోని పలు చోట్ల ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించే కార్యాచరణను మున్సిపల్ కమిషనర్ ఆర్.విరుపాక్ష మూర్తి నేతృత్వంలో అధికారులు, పౌర కార్మికులు బుధవారం ప్రారంభించారు. గంగావతి నగరంలో అమృత్ సిటీ పథకం కింద నిర్మించిన పాదచారుల ఫుట్‌పాత్‌లను దుకాణదారులు గత కొన్నేళ్లుగా ఆక్రమించుకుని అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు కలుగుతున్న అసౌకర్యం నేపథ్యంలో తొలగింపు చేపట్టారు.
వడదెబ్బతో బాలుడు మృతి
● విజయపుర జిల్లాలో ఘటన
● వారం రోజుల్లో నలుగురు బలి
సాక్షి బళ్లారి/రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో రోజురోజుకు ఎండలు బీభత్సం సృష్టించడంతో వడదెబ్బకు గురై ఓ బాలుడు మృతి చెందాడు. బుధవారం విజయపుర జిల్లా ముద్దేబిహాళ తాలూకా ఇంగళిగి గ్రామానికి చెందిన శ్రీశైల బిరాదార్(15) అనే బాలుడు పాఠశాలకు వేసవి సెలవుల నేపథ్యంలో మండుటెండల్లో ఆటలాడుతున్న సమయంలో వడదెబ్బ సోకి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత వారం రోజుల్లోనే నలుగురు వడదెబ్బకు అసువులు బాశారు.
మే 15న శిఖండి విడుదల
బళ్లారిఅర్బన్: పోలా మూవీ బ్యానర్‌పై నిర్మించిన శిఖండి చిత్రం 15న రాష్ట్ర వ్యాప్తంగా, ఆల్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నదని పోలా ప్రవీణ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చిత్రం బృందం టీజర్ పాటలను విడుదల చేసి సినిమా విశేషాలను తెలియజేశారు. చిత్ర దర్శకుడు గురుమూర్తి మాట్లాడుతూ మహాభారతంలో శిఖండి పాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పారు. బళ్లారి, బెంగళూరు, మైసూరు, మాగడి తదితర ప్రాంతాలలో సినిమా చిత్రీకరణ చేసినట్లు తెలిపారు. యువరాజ్ గౌడ, ఖ్యాతి, దీపా శెట్టి, ఆనంద్, చాందిని, ఫోటోగ్రాఫర్ మైసూరు స్వామి పాల్గొన్నారు.
అఫ్జల్‌పూర్ హాస్టల్ వార్డెన్‌పై పోక్సో కేసు
రాయచూరు రూరల్: బాలికలపై లైంగిక దౌర్జన్యాలు చేస్తున్నారన్న ఆరోపణల మేరకు హాస్టల్ వార్డెన్‌పై పోక్సో కేసు నమోదైంది. కలబుర్గి జిల్లా అఫ్జల్‌పూర్ హాస్టల్ వార్డెన్‌పై హనుమంతి అనే బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈనెల 15వ తేదీన ఘటన జరగడంతో సమస్యల పరిష్కారానికి మార్గం కనబడుతుందని వేచి చూసినా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోక పోవడంతో మంగళవారం సాయంత్రం తనకు రాత్రి సమయంలో ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో వార్డెన్ సంభాషిస్తున్నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
సమస్యలపై స్పందించరూ
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి పట్టణంలో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాజీ శాసన సభ్యుడు గంగాధర నాయక్, జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు దొరబాబు మాట్లాడారు. బస్టాండ్ వద్ద ప్రయాణికుల రాకపోకలకు సౌకర్యం కల్పించాలని, ప్రధాన రహదారిలోని కూరగాయలు, మాంసం విక్రయ దుకాణాలను ఇతర చోట్లకు తరలించాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర ఎడమ కాలువలో సక్రమంగా నీరు ప్రవహించేలా చూడాలని, నగరంలో మురుగు కాలువల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు.
మలేరియా అడ్డుకట్టకు సహకరించండి
రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ అధికారి డాక్టర్ సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ అధికారి కార్యాలయం వద్ద జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ కళ్యాణ శాఖ, తాలూకా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, నగరసభల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ జాతానుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి ప్రజలను చైతన్యపరిచి, ఇంటి పరిసరాల చుట్టు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. రక్త పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చన్నారు. జాతాలో మలేరియా నియంత్రణాధికారి శాకీర్, డాక్టర్ గణేష్, అధికారులు చంద్రశేఖరయ్య, సంధ్య, జయపాల్ రెడ్డి, సరోజ, అమృతలున్నారు.


