బస్సు డ్రైవర్‌కు ఏడాది జైలు, జరిమానా | - | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్‌కు ఏడాది జైలు, జరిమానా

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

హుబ్లీ: గదగ్‌ రోడ్డు గాంధీవాడ క్రాస్‌లో 2023లో జరిగిన బస్సు ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతి చెందిన కేసులో బస్సు డ్రైవర్‌కు ఏడాది సాధారణ శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ స్థానిక ప్రధాన సీనియర్‌ సెషన్స్‌ కోర్టు జేఎంఎఫ్‌సీ ఫస్ట్‌గ్రేడ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలను వెల్లడించారు. బస్సు డ్రైవర్‌ బాలేష్‌ బోరన్నవర శిక్షకు గురైన వ్యక్తి. వివరాలు.. 2023 జూలై 23న గదగ్‌ రోడ్డులోని గాంధీవాడ క్రాస్‌ కళ్యాణ కేంద్రం సమీపంలో ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ బాలేష్‌ బోరన్నవర వేగంగా బస్సును నడుపుకుంటూ వెళుతున్న వేళ సీ.జాకోబ్‌ తైలాష్‌ను బస్సు ఢీకొనడంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. సీఐ కాడదేవర మఠ దర్యాప్తు జరుపగా మరో సీఐ జాక్సన్‌ డిసౌజా కోర్టుకు చార్జిషీట్‌ సమర్పించారు. సదరు కోర్టు న్యాయయూర్తి యమునప్ప కరె హనుమంతప్ప ఈనెల 22న తీర్పు వెల్లడించారు. నిందితుడిపై నేరారోపణలు రుజువైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది సిద్దలింగప్ప నాగఠాణ వాదనలు వినిపించారు.

లోకాయుక్త వలలో ఆర్టీఓ సిబ్బంది

రూ.21 వేల నగదు స్వాధీనం

సాక్షి, బళ్లారి: కొప్పళ జిల్లాలో ఆర్టీఓ కార్యాలయంలో పని చేస్తున్న రంజిత్‌ అనే ఎస్‌డీఏ సిబ్బంది రూ.21 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకొన్నారు. కొప్పళ ప్రాంతీయ రవాణాధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఎస్‌డీఏ(సెకండ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌) లోకాయుక్త అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా బంధించారు. ఒక ఫైల్‌కు సంబంధించి బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో మెరుపుదాడి చేసి అరెస్టు చేశారు.

బీఏ సోషియాలజీలో మూడు అధ్యాయాలు కల్పించాలి

రాయచూరు రూరల్‌: విద్యార్థులకు అనుకూలంగా బీఏ సోషియాలజీలో మూడు పీజీ అధ్యాయాలను కల్పించాలని రాష్ట్ర అక్క మహాదేవి విశ్వ విద్యాలయం సోషియాలజీ అధ్యాపకుల సంఘం డిమాండ్‌ చేసింది. అక్క మహాదేవి విశ్వవిద్యాలయం ఆవరణలో సోషియాలజీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మహేష్‌ గంగ్వార్‌ మాట్లాడారు. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక ఆధీనంలోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో విద్యార్థులకు భవిష్యత్తులో సోషియాలజీ విషయం అర్థమయ్యే విధంగా మరికొన్ని అంశాలను చేర్చించాలన్నారు. ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బళిగార్‌, భారతి, శ్రీనివాస్‌ రెడ్డిలున్నారు.

బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వండి

రాయచూరు రూరల్‌: వడ దెబ్బతో ప్రాణాలు కోల్పోయిన హుసేనప్ప కుటుంబానికి పరిహారం అందించాలని సీపీఐ(ఎంఎల్‌) డిమాండ్‌ చేసింది. బుధవారం తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాయచూరు తాలూకా యాపలదిన్నిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసే ప్రాంతంలో నీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు లేవన్నారు. గ్రామ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం అందించాలని కోరుతూ టీపీ ఈఓ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు.

సీహెచ్‌ పౌడర్‌ విక్రేతల అరెస్ట్‌

రాయచూరురూరల్‌: నగర ప్రాంతాల్లో సీహెచ్‌(క్లోరల్‌ హైడ్రేట్‌) పౌడర్‌ విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వే ఉద్యానవనం వద్ద మహ్మద్‌ హాజీ, నాగరాజ్‌లను అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుల నుంచి 35 లీటర్ల కల్తీ కల్లు, 30 లీటర్ల సీహెచ్‌ పౌడర్‌ను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మంజునాథ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement