హొసపేటె: బీజేపీలో ఒక దిగ్గజ నాయకుడిగా, సహజ పోరాట యోధుడిగా, రాజకీయ ఉద్దండుడిగా, రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని సీనియర్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, మైనార్టీ కార్యకర్తలు ఆయనను వచ్చే నెల 9న చిత్రదుర్గలో ఘనంగా సన్మానించి గౌరవించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. బుధవారం నగరంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలో అభిమానోత్సవ పేరిట చిత్రదుర్గలో ఈ సన్మాన కార్యక్రమం జరగనున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, యడియూరప్ప అభిమానులు పెద్ద సంఖ్యలో ఆరోజు చిత్రదుర్గకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఒక స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రులు గోవింద కారజోళ, బీ.శ్రీరాములు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దొడ్డనగౌడ పాటిల్, మాజీ మంత్రి ఆనంద్‌సింగ్, హడగలి ఎమ్మెల్యే కృష్ణా నాయక్, ఎమ్మెల్సీలు వైఎం.సతీష్, హేమలత నాయక్, హాలప్ప ఆచార్, పీ.రాజీవ్, శరణు సలగార్, సురేష్‌బాబు, సోమలింగప్ప, కేఎస్.దివాకర్, బసవరాజ కెవటర్, అమర్‌నాథ్ పాటిల్, చెన్నబసవనగౌడ పాటిల్, అరుణ్ శహాపుర, బ్యాలహుణసి రామణ్ణ, సంజీవ రెడ్డి, అనిల్‌కుమార్ మోకా, నవీన్ గులగణ్ణవర, దడేసూగూరు బసవరాజ్, పరణ్ణ మునవళ్లి తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలి
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర


