బళ్లారిఅర్బన్: నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కోర్టు ఎదురుగా పెట్టుకున్న ఎగ్‌రైస్ బండిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం.. జీవనోపాధి కోసం ఎగ్‌రైస్ బండి నడుపుతున్న సరస్వతి, రవి అనే దంపతులు మంగళవారం రాత్రి రోజూ మాదిరిగానే ఎగ్‌రైస్ బండి నడుపుకుని రాత్రి 12 గంటలకు బండిలో స్టవ్, చెయిర్లు, వాటర్ బాటిళ్లు, జగ్గులు వంటి సామగ్రిలు ఉంచి సిలిండర్ మాత్రం ఇంటికి తీసుకెళ్లారు. అయితే రాత్రి 2 గంటలకు పక్కన ఉన్న హాస్టల్ విద్యార్థుల సమాచారం మేరకు ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయగా నిప్పంటుకున్న బండిని ఆర్పేందుకు వచ్చేటప్పటికే బండి కాలి బూడిద అయింది. బండి, అందులోని సామగ్రి తదితరాలతో కలిపి మొత్తం రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు సరస్వతి ఆరోపించింది. గత కొన్నేళ్లుగా బండితోనేజీవనాధారం సాగిస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నామన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో వారు భోరుమన్నారు. విషయం తెలిసిన అక్క వాసంతి, కళావతి, స్థానిక బంధువులు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై గాంధీనగర్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రూ.50 వేల మేర వాటిల్లిన నష్టం
జీవనాధారం కోల్పోయిన కుటుంబం


