రాజధాని అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

రాజధాని అస్తవ్యస్తం

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

అకాల వర్షం..

సాయంత్రం నుంచి కుదిపేసిన గాలీవాన

దట్టంగా కురిసిన వడగండ్లు పలుచోట్ల కూలిన చెట్లు

బసవనగుడిలో చెట్టు పడడంతో ధ్వంసమైన కారు

బుధవారం సాయంత్రం యశవంతపురలో జోరువాన

నృపతుంగ రోడ్డులో భారీ వర్షంలో వీధి వ్యాపారి

బనశంకరి: రోజూ 35– 40 డిగ్రీల ఎండ వేడిమితో అల్లాడుతున్న సిలికాన్‌ సిటీలో బుధవారం సాయంత్రం హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులు, వడగండ్లతో అకాల వర్షం కుదిపేసింది. గాలులకు చెట్లు కూలి రోడ్లపై, వాహనాలపై పడడంతో విధ్వంసం చోటుచేసుకుంది. కొన్నిచోట్ల అడుగు ఎత్తున వడగండ్లు పేరుకుపోవడం నగరవాసులకు ఆశ్చర్యం పంచింది.

మండుటెండలు, ఉక్కపోతతో సతమతమౌతున్న నగరవాసులకు ఈ వానలతో ఉపశమనం కలిగింది. సాయంత్రం నుంచి జోరువాన మొదలైంది. దీంతో వాహనదారులు, పాదచారులు చాటు కోసం పరుగులు తీశారు. రోడ్లపై వాహన సంచారం అస్తవ్యస్తమైంది. జేపీ.నగర, జయనగర, బన్నేరుఘట్ట, బనశంకరి, బీటీఎం లేఔట్‌. శాంతినగర, లాల్‌బాగ్‌, విల్సన్‌ గార్డెన్‌, కార్పొరేషన్‌, చిన్నస్వామి స్టేడియం, ఎంజీరోడ్డు, హలసూరు, శివాజీనగర, రేస్‌కోర్సురోడ్డు, మెజెస్టిక్‌, శివానందసర్కిల్‌, మల్లేశ్వరం, బసవనగుడి, ట్రినిటి సర్కిల్‌, రాజాజీనగర, కేఆర్‌. మార్కెట్‌, మల్లేశ్వరం, కోరమంగల తదితర ప్రాంతాల్లో వడగండ్లు వర్షం కురిసింది. విల్సన్‌గార్డెన్‌ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో జలమయమైంది. వాహనాలు కూడా మునిగిపోయాయి. మల్లేశ్వరంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్నిచోట్ల కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. విధానసౌధలో పలు చాంబర్లలోకి వాననీరు చేరింది.

శివాజీనగర: హాసన్‌, తుమకూరు, బెంగళూరు గ్రామీణ, చిక్కమగళూరు, దావణగెర, శివమొగ్గ, భద్రావతి, రాయచూరు జిల్లాల్లో వర్షం కురిసింది. గాలులు చెలరేగడంతో కరెంటు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు కరెంటు లేక అవస్థలు పడ్డారు. యాదగిరి జిల్లాలో గురుమిఠ్కల్‌ తాలూకా బూదురు గ్రామంలో పిడుగులు పడి ఇద్దరికి చెందిన 60 గొర్రెలు చనిపోయాయి. బెంగళూరు గ్రామీణ జిల్లాలో కూడా మెరుపులు, పిడుగుల వర్షం కురిపింది. 3 పశువులు చనిపోయాయి. తుమకూరులో పిడుగు పడి షీట్ల ఇల్లు ధ్వంసమైంది.

హఠాత్తుగా వర్షం...

పలు జిల్లాల్లో గాలీవాన

Advertisement
 
Advertisement
Advertisement