కాలువలోకి కారు పల్టీ | - | Sakshi
Sakshi News home page

కాలువలోకి కారు పల్టీ

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

తల్లీ, చిన్నారి కొడుకు మృతి

యశవంతపుర: తీర్థయాత్ర విషాదమయమైంది. హాసన్‌ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా మల్లఘట్ట సమీపంలో బుధవారం మధ్యాహ్నం కారు కాలువలోకి పడడంతో తల్లీ బిడ్డ చనిపోయారు. ఓ కుటుంబం ధర్మస్థల యాత్రకు వెళ్లి తిరిగి చన్నరాయపట్టణానికి వస్తుండగా కారు వేగంలో అదుపుతప్పి హేమావతి నీటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రియాంక (30), ఆమె ఏడాదిన్నర కొడుకు కారులో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. మిగిలినవారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాణనష్టం జరిగింది. చన్నరాయపట్టణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. తల్లీ బిడ్డను పోగొట్టుకున్న కుటుంబం కన్నీమున్నీరైంది.

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

దొడ్డబళ్లాపురం: బీదర్‌ పట్టణంలోని గురునానక్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రిలో ఒకచోట షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి క్షణాల్లో వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా కమ్ముకోవడంతో వందల సంఖ్యలో రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరిగెత్తారు. ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు.

హావేరిలో పిచ్చికుక్కల దాడులు

దొడ్డబళ్లాపురం: హావేరి పట్టణంలో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. పలు ప్రాంతాలలో పిల్లలతో కలిపి మొత్తం 10 మందిపై దాడిచేసి గాయపరిచాయి. పృథ్విక్‌ (7), యశ్వంత్‌ (3), ఫాతిమా (5), అహ్మద్‌ వలి (4), భువన్‌ (2), కార్తీక్‌ (6), నింగమ్మ (70) తదితరులను కరిచాయి. ఆ కుక్కలు పిచ్చిపట్టి కనిపించినవారి మీదల్లా దాడి చేశాయి. బాధితులకు హావేరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రజలు మున్సిపల్‌ అధికారులపై మండిపడ్డారు. వీధి కుక్కల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.

చెట్టును ఢీకొన్న కారు

కుటుంబానికి గాయాలు

చింతామణి: టైరు పేలడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొనింది.

ఈ సంఘటన బుధవారం పట్టణంలోని కన్నపల్లిలో జరిగింది. వివరాలు.. చింతామణి కెఆర్‌ లేఔట్‌లో నివసించే ఇదయతుల్లా, భార్య రోహి, పిల్లలు మహమ్మద్‌ ఉమర్‌, రోహినా, రిహా ఫిర్దోజా కారులో బెంగళూరుకు బయల్దేరారు. అయితే కొంతసేపటికే కారు వెనుక టైర్‌ పేలిపోయి ఓ చెట్టును ఢీకొన్నారు. గాయపడిన ఐదుగురినీ జనం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో దంపతులు, కొడుకు ఉమర్‌ పరిస్ధితి ఆందోళకరంగా ఉండంతో బెంగళూరుకు పంపించారు. ఇద్దరు పిల్లలు చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎస్‌ఐ భార్య ఆత్మహత్య

యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సజావుగా సాగిపోతున్న కుటుంబంలో చిన్న గొడవలే పెద్దవయ్యాయి. కుటుంబ కలహాలతో ఎస్‌ఐ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా బీరూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. బీరూరు ఎస్‌ఐ తిప్పేశ్‌ భార్య పద్మ (35) మంగళవారం రాత్రి ఇంటిలో ప్రాణాలు తీసుకుంది. బీరూరు పట్టణంలో బాడుగ ఇంటిలో తిప్పేశ్‌ కుటుంబం ఉంటోంది. పద్మది తుమకూరు జిల్లా కాగా, తిప్పేశ్‌ది దావణగెరె జిల్లా. వీరిద్దరూ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ పిల్లలను ఎక్కడ చదివించాలి, సెలవుల గురించి గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement