భార్యను చంపి.. శిశువుతో కలిసి బావిలోకి దూకిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను చంపి.. శిశువుతో కలిసి బావిలోకి దూకిన భర్త

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

రాయచూరు రూరల్‌: చిన్న గొడవలకే కుటుంబాలు కడతేరిపోతున్నాయి. భార్యను చంపి బావిలోకి దూకి భర్త అత్మహత్య చేసుకున్నాడు. 9 నెలల శిశువును ఎత్తుకుని అతడు బావిలోకి దూకగా, స్థానికులు ఆ శిశువును కాపాడారు. ఈ హృదయ విదారక సంఘటన కలబుర్గి జిల్లాలో అఫ్జలపుర తాలూకా కె.మాదారలో జరిగింది. వివరాలు.. లక్ష్మిపుత్ర (23) చిన్నపాటి రైతు కాగా, అతనికి భార్య అంజలి (22), 9 నెలల పసికందు ఉన్నారు. తరచుగా భార్యాభర్తలు గొడవలు పడేవారు. ఇదే మాదిరిగా సోమవారం సాయంత్రం కూడా ఘర్షణ జరిగింది. భర్త భార్యను కొడవలితో నరికి చంపి శిశువును ఎత్తుకుని ఊరిబయటకు వచ్చాడు, అక్కడ ఓ బావిలోకి దూకాడు. దూరం నుంచి చూసిన స్థానికులు పరుగున వచ్చి బావిలోకి దూకి శిశువును బయటకు తెచ్చారు. ఇంతలో లక్ష్మిపుత్ర నీట మునిగి చనిపోయాడు. రేవూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను కలబుర్గి అస్పత్రికి తరలించారు. నెలల వయసుకే అనాథగా మారిన పసిబిడ్డను చూసి బంధుమిత్రులు అయ్యో అని విలపించారు.

పలు జిల్లాలకు వర్షసూచన

దొడ్డబళ్లాపురం: ఎండలతో అల్లాడిపోతున్న సమయంలో వాతావరణ శాఖ ప్రజలకు చల్లని వార్త అందించింది. పలు జిల్లాల్లో వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో మంగళవారం నుంచి ఉరుములతో వానలు పడవచ్చు. బెళగావి, బాగలకోట, రాయచూరు, ధార్వాడ, గదగ్‌, హావేరి, కలబుర్గి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయి.

నల్ల చిరుత కనువిందు

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలె మహదేశ్వర వన్యధామం పీజీ పాళ్య వలయంలో లొక్కనహళ్లిలో నల్ల చిరుత కనిపించింది. టూరిస్టులను సఫారీ వాహనంలో తీసుకెళ్తుండగా అరుదైన నల్ల చిరుత దర్శనమిచ్చింది. పర్యాటలకు ఫోటోలు, వీడియోలు తీసుకోవడంతో పాటు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వేసవి కావడంతో ఆహారం కోసం వెదుక్కుంటూ వచ్చే చిరుతలు, ఇతర వన్యప్రాణులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

డీసీఎంపై అశోక్‌ ధ్వజం

శివాజీనగర: నాలుగు ఓట్ల కోసం దేశద్రోహులను బ్రదర్స్‌ అని సమర్థించుకునే స్వార్థపరులు రాష్ట్రంలో సీఎం కావడానికి ప్రయత్నించటం కర్ణాటక దురదృష్టకరమని బీజేపీ పక్షనేత ఆర్‌.అశోక్‌, డీసీఎం డీకే శివకుమార్‌ మీద ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మంగళూరు కుక్కర్‌ బాంబు పేలుడుని డైవర్షన్‌ పాలిటిక్స్‌ అంటూ ఉగ్రవాదికి డీకే అండగా నిలిచారన్నారు. దేశ భద్రత కంటే కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌ రాజకీయమే ముఖ్యమైనదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement