రైతుల అరెస్టుపై డీవైఎఫ్‌ఐ నిరసన | - | Sakshi
Sakshi News home page

రైతుల అరెస్టుపై డీవైఎఫ్‌ఐ నిరసన

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

బళ్లారిటౌన్‌: జిల్లాలోని కుడితిని వద్ద సోమవారం ఆందోళన చేపడుతున్న వందలాది మంది రైతులను అరెస్టు చేయడంపై మంగళవారం డీవైఎఫ్‌ఐ జిల్లా సమితి నిరసన ర్యాలీ నిర్వహించింది. సమితి జిల్లాధ్యక్షుడు యూ.ఎర్రిస్వామి మాట్లాడుతూ కుడితిని చుట్టు పక్కల 7 గ్రామాల్లో 900 ఎకరాల రైతుల భూములను జిందాల్‌ కంపెనీకి అప్పగించడాన్ని ఖండిస్తు భూమి కోల్పోయిన రైతులు శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే దాదాపు 300 మంది పైగా రైతులను అరెస్ట్‌ చేయడం తీవ్ర ఖండనీయం అన్నారు. 2010లో రైతుల నుంచి 5,367 ఎకరాల భూములను బలవంతంగా లాక్కొని 16 ఏళ్లవుతున్నా పరిశ్రమలు స్థాపించలేదన్నారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. డీవైఎఫ్‌ఐ నేతలు నవీన్‌, ఎన్‌.ఎర్రిస్వామి, కే.తిప్పేరుద్ర, మస్తాన్‌సాబ్‌, శివనందన్‌, నాసీర్‌, రామాంజి, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి నివారించండి

రాయచూరు రూరల్‌: వేసవిలో మూడు నెలల పాటు జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర, కృష్ణా నదీ ప్రాంత గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలన్నారు. విద్యుత్‌ కోతలు, మోటర్లు చెడిపోవడం, ఇతరత్ర కారణాలు చెప్పకుండా నీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నింపాలని పీడీఓలను ఆదేశించాలని టీపీ అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఏసీ హంపన్న, టీపీ ఈఓ చంద్రశేఖర్‌ పవార్‌లున్నారు.

వడ దెబ్బకు

కూలీ కార్మికుడు బలి

రాయచూరు రూరల్‌: కల్యాణ కర్ణాటకలో ఎండలు మండుతుండడంతో వడ దెబ్బకు కూలీ కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడిని రాయచూరు తాలూకా యాపలదిన్నికి చెందిన వ్యవసాయ కూలీ కార్మికుడు హుసేనప్ప(45)గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్న సమయంలో నరేగ పనులు ముగించుకొని ఇంటికొస్తుండగా ఎండలు అధికంగా ఉండడంతో వడదెబ్బ సోకి మరణించాడు. లో బీపీ రావడంతో వడ దెబ్బకు గురై కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల్లోనే ముగ్గురు వడ దెబ్బకు అసువులు బాసారు.

ఆర్టీసీ బస్సు బోల్తా..

44 మందికి గాయాలు

తృటిలో తప్పిన పెను ప్రమాదం

చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె వద్ద ఘటన

సాక్షి బళ్లారి: కేఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం బళ్లారి నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు చళ్లకెరె సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా 44 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె తాలూకా హెగ్గెరె గ్రామ సమీపంలో డ్రైవర్‌ అదుపు కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నారు. చళ్లకెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

బకాయి వేతనాలు చెల్లించరూ

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అతిథి ఉపాధ్యాయులకు బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐడీవైఓ డిమాండ్‌ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో అక్షర ఆవిష్కార పథకం కింద నియమించుకున్న అతిథి ఉపాధ్యాయులకు బకాయి ఉన్న 10 నెలల గౌరవ వేతనాలను చెల్లించాలన్నారు. అతిథి ఉపాధ్యాయులకు రూ.12,500, సహాయకులకు రూ.6,550 చొప్పున వేతనాలు పెండింగ్‌లో ఉంచారన్నారు. విద్యా సంవత్సరం ముగిిసి ఏడాది కావస్తున్నా 10 నెలల వేతనాలను చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement