రేపు ద్వితీయ పీయూ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

రేపు ద్వితీయ పీయూ సప్లిమెంటరీ పరీక్షలు

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు

సర్వం సిద్ధం

2,995 మంది విద్యార్థుల పేర్లు నమోదు

బళ్లారి రూరల్‌: ఏప్రిల్‌ 30న జరగబోయే ద్వితీయ పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైనట్లు దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధర స్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన ముందస్తు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 30 నుంచి మే 13 వరకు జరిగే పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,995 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. దావణగెరెలో 1,629, జగళూరులో 391, చెన్నగిరిలో 401, హరిహరలో 321, హొన్నాళిలో 250 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బాధించాయి

చళ్లకెరె రూరల్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి డీ.సుధాకర్‌పై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని మంత్రి కుమారుడు సుహాస్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్య విషయాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి చికిత్సకు స్పందిస్తున్నారని, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఇప్పటికే ఆస్పత్రికి వచ్చి తన తండ్రి ఆరోగ్యంపై వాకబు చేశారని అన్నారు.

30న ఉచిత ధ్యాన శిబిరం

బళ్లారిటౌన్‌: నగరంలోని నెహ్రు కాలనీలోని గురుశాంతప్ప లేఅవుట్‌లోని రామచంద్ర యోగాశ్రమంలో ఈ నెల 30న ఉచిత ధ్యాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామచంద్రజీ బ్రాహ్మణుల పేరుతో రామచంద్ర మిషన్‌ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి చాలా యోగాశ్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి జీవనశైలిలో మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతిని తెలియజేస్తారన్నారు. ఆ రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు సార్వజనిక సభను ఏర్పాటు చేసి ఆసక్తి గల వారికి ఉచిత ధ్యాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.

మెరుగైన వైద్య సేవలు అందించండి

రాయచూరు రూరల్‌: నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రిలో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని విధాన పరిషత్‌ సభ్యుడు వసంత కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని హరిజనవాడ, ఎల్‌బీఎస్‌ నగర్‌, మావినకెరె చెరువు వద్ద ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, ఇతర శాఖాధికారులు హాజరు పుస్తకంలో అటెండెన్స్‌ వేసి బయటికి పోవడంపై ఆక్రోశం వ్యక్తం చేస్తూ జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబుతో ఫోన్‌లో సంభాషించి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు.

వేశ్యా వాటికపై దాడి.. 11 మంది అరెస్ట్‌

రాయచూరు రూరల్‌: మహిళలకు ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశ చూపి వేశ్యా వాటికలో దింపుతున్న ప్రధాన వ్యక్తితో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన జిల్లాలోని మాన్వి తాలూకాలో చోటు చేసుకుంది. మాన్వి తాలూకా హిరే కొట్నేకల్‌–బ్యాగవాట్‌ కెనాల్‌ రహదారి పొలంలో వేశ్యా వాటిక నిర్వహిస్తున్న విషయం మాన్వి సీఐ సోమశేఖర్‌ కెంచరెడ్డికి తెలియగానే డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ ఆదేశాల మేరకు దాడి చేసి ప్రధాన నిందితుడు మాన్వి ఇందిరా నగర్‌ నివాసి తాయప్పను అరెస్ట్‌ చేిసినట్లు పోలీసులు తెలిపారు.

పిడుగుపాటుకు 60 గొర్రెల మృతి

సాక్షి బళ్లారి: యాదగిరి జిల్లాలో పిడుగుపాటుకు 60 గొర్రెలు మృతి చెందాయి. మంగళవారం ఆ జిల్లాలోని గురుమటకల్‌ తాలూకా బూదురులో పిడుగులతో కూడిన గాలి, వాన కురవడంతో మల్లప్ప, జల్లప్పల గొర్రెలు మృతి చెందాయి. అయితే తృటిలో గొర్రెల కాపరులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement