బళ్లారిఅర్బన్: నగరాభివృద్ధికి కొత్త దిశను అన్వేషించే ఉద్దేశంతో బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (బుడా) అధ్యక్షుడు జేఎస్ ఆంజనేయులు ఆధ్వర్యంలో మేయర్ పీ.గాదెప్పతో పాటు సభ్యుల బృందం ముంబై నగరానికి ప్రగతి పరిశీలన అధ్యయన పర్యటన చేపట్టింది. బృందం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్‌డీఏ) కార్యాలయాన్ని సందర్శించి, ప్రాధికార సంస్థ కమిషనర్ సంజయ్ ముఖర్జీ, చీఫ్ అర్బన్ ప్లానర్ శంకర్ దేశ్‌పాండే, సాంకేతిక అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మహానగరాల సమగ్ర మాస్టర్ ప్లాన్, స్థిరమైన నగరాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, నివాస వసతుల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం మహానగరాలు ఎదుర్కొంటున్న జనాభా పెరుగుదల, గృహాల కొరత, ట్రాఫిక్ రద్దీ, నీటి సరఫరా, మలినాల నిర్వహణ సమస్యలను విశ్లేషిస్తూ, వాటికి దీర్ఘకాలిక పరిష్కార మార్గాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు.
బళ్లారిలో అమలుపై చర్చ
ముంబైలో అమలు చేస్తున్న ఆధునిక ప్రాజెక్టులు, సాంకేతిక ఆధారిత నగర నిర్వహణ విధానాలను బళ్లారిలో అమలు చేసే అవకాశాలపై కూడా చర్చించారు. ఈ అధ్యయన పర్యటనలో బుడా సభ్యులు కే.రంజిత్ కుమార్, కేఎస్.భరత్‌కుమార్, నగర ప్రణాళిక సభ్యుడు ఎన్‌టీ శంకర్‌రెడ్డి తదితర బుడా సిబ్బంది పాల్గొన్నారు. ముంబై నమూనాను అధ్యయనం చేయడం ద్వారా బళ్లారి నగర సమగ్ర అభివృద్ధికి కొత్త ప్రణాళిక రూపొందించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని సభ్యులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంపై ఆధారపడి త్వరలోనే బళ్లారిలో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన రహదారుల నెట్‌వర్క్, సమగ్ర నగర ప్రణాళిక, పర్యావరణ అనుకూల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తగిన చర్యలు తీసుకుంటామని బుడా అధికారులు తెలిపారు.
మహానగర అభివృద్ధి నమూనాపై విస్తృత చర్చ


