రాయచూరు రూరల్: తల్లీబిడ్డల ఆస్పత్రిలో నవజాత శిశువు మరణంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేిపట్టిన ఉదంతం జిల్లాలోని సింధనూరులో చోటు చేసుకుంది. సింధనూరులోని తల్లీ బిడ్డల ఆస్పత్రిలో ఈనెల 22న కవితాళ మండలం జంగమర హళ్లికి చెందిన పారమ్మ కాన్పు కోసం వచ్చి చేరింది. వారం రోజుల నుంచి మామూలు కాన్పులు అవుతాయంటూ కాలం గడిపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రిలో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. ఉన్నఫళంగా శిశువుకు ఊపిరాడటం ఇబ్బందిగా ఉందని ఈనెల 27న ఆపరేషన్ ద్వారా శిశువును వెలికి తీయగా తనువు చాలించింది. కుటుంబ సభ్యులు మృతి చెందిన శిశువుతో ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కడుపులోనే బిడ్డకు ఊపిరాడక చనిపోయిందని, తమ ప్రయత్నాలు తాము చేసినా ఫలితం లేకపోయిందని ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ కావేరి తెలిపారు.
సేవల్లో వైద్యులు విఫలమంటూ ఆందోళన
రాయచూరు జిల్లా సింధనూరులో ఘటన


