గౌరిబిదనూరు: తాలూకాలోని అలకాపురంలోని పురాతన చన్నసోమేశ్వరుని దేవాలయం ఆవరణంలో నందీశ్వరుని విగ్రహాన్ని సోమవారం ప్రతిష్టించారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముని విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి యోగిరాజ్ ఈ నంది విగ్రహాన్ని కూడా మలిచారు. సిద్దరబెట్ట వీరభద్ర శివాచార్య స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రముఖుల సమక్షంలో ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తమ్ముని ఇంటిపై సోదరి దాడి
బనశంకరి: ఆస్తి వివాదంలో తమ్ముని ఇంటికి నిప్పుపెట్టడానికి ప్రయత్నించిందో అక్క. ఈ ఘటన బెంగళూరులో సిద్దాపుర ఠాణా పరిధిలోని జయనగర బైరసంద్రలో సోమవారం జరిగింది. సోదరుడు ఉమేశ్ ఇంటిలోకి అక్క మీనాక్షి, భర్త, పిల్లలు చొరబడటానికి ప్రయత్నించారు. కొడవలి, కట్టెలతో ఇంటి కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను నాశనం చేశారు. పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించడానికి ప్రయత్నించారు. ఇంట్లో దాక్కున్న ఉమేశ్ భార్య అశ్విని, కుటుంబసభ్యులు ప్రాణభయంతో హడలిపోయారు. వారు డయల్ 112 కు ఫోన్ చేసి చెప్పగా కొంతసేపటికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అశ్విని సిద్దాపుర ఠాణాలో ఫిర్యాదు చేసింది.
మహిళా టెక్కీ ఆకస్మిక మృతి
యశవంతపుర: హాసన్ జిల్లాలో మహిళా టెక్కీ ఆకస్మికంగా మరణించింది. తల లోపల తీవ్రమైన రక్తస్రావం కావడంతో కోమాలోకి వెళ్లి, చికిత్స పొందుతూ బేలూరు తాలూకా బండిలక్కనకొప్పలు గ్రామానికి చెందిన శ్వేత (25) కన్నుమూసింది. ఆమె హాసన్‌లోని ఓ కంపెనీలో మూడేళ్ల నుంచి టెక్కీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోందని తల్లిదండ్రులు గంగాధర–సరోజ తెలిపారు. తలనొప్పిగా ఉందంటూ చెప్పి స్పృహ తప్పి పడిపోయిందని, ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేదని విలపించారు.
మహిళ అనుమానాస్పద మృతి
బనశంకరి: బెంగళూరు గౌడహళ్లిలో వాషింగ్ మెషిన్ నుంచి కరెంటు షాక్ కొట్టడంతో ఓ మహిళ మరణించినట్లు ఆమె భర్త చెబుతున్నాడు. ఆమె తల్లిదండ్రులు అల్లుడే ఏదో చేశాడని అనుమానం వెలిబుచ్చారు. వివరాలు.. తుమకూరు హెగ్గెరె నివాసులైన పాండురంగయ్య, భాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె సుజాత (30)కు పదేళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతన్‌తో వివాహమైంది. సోమవారం ఉదయం వాషింగ్‌మెషిన్‌లో బట్టలు వేయడానికి స్విచ్ ఆన్ చేయగా కరెంటు షాక్ కొట్టి చనిపోయిందని భర్త తెలిపాడు. ఇది అబద్ధమని, భర్త కుట్ర ఉందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
డీకేకు చాన్స్ వస్తుంది: ఎమ్మెల్యే
దొడ్డబళ్లాపురం: సిద్ధరామయ్య తరువాత సీఎం రేస్‌లో ఉన్నది ఒక్క డీకే శివకుమార్ మాత్రమేనని, ఈ అవధిలోనే డీకేకి సీఎం చాన్స్ లభిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలక్రిష్ణ అన్నారు. రామనగరలో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి డి.సుధాకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వేలిముద్ర వేయించుకోవడానికి సుధాకర్ వద్దకు ఎవరో వెళ్లారని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అనడం సిగ్గుచేటన్నారు. ఇలా మాట్లాడతారనుకోలేదన్నారు. డీకే శివకుమార్,డీ సుధాకర్ మంచి స్నేహితులని, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్లారన్నారు. హైకమాండ్ మంత్రిమండలి విస్తరణను ఎందుకు ఆలస్యం చేస్తోందో తెలీడం లేదన్నారు.
రేసు కారు పల్టీలు
దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో డర్ట్ ట్రాక్ రేస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రేస్‌లో మట్టి రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనతో నిర్వాహకులు, ప్రేక్షకులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.


