మహిళలను సురక్షితంగా ఉండనివ్వరా? | - | Sakshi
Sakshi News home page

మహిళలను సురక్షితంగా ఉండనివ్వరా?

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్‌.. బెంగళూరు మెట్రో చిక్స్‌ అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్‌ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పోలీసులారా.. ఇదేం పని?

యశవంతపుర: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్‌ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.

మెట్రో రైళ్లలో రహస్య వీడియోల కేసులో హైకోర్టు ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement