దొడ్డబళ్లాపురం: పొలంలో నీటి కుంటలో పడి తల్లీ , బిడ్డ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా లక్ష్మిసాగర్ గ్రామంలో జరిగింది. గ్రామవాసి సంపత్ భార్య లావణ్య (28), కుమార్తె లక్షిత (8) శివారులోని ఓ పొలంలోని ఫారంపాండులో శవాలై తేలారు. ఇది ప్రమాదమా, హత్యా, ఆత్మహత్యా అనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. లావణ్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త సంపత్ హత్య చేసి నీటికుంటలో పడేసి ఉంటాడని అతనిపై సూర్యనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు.
చెరువులో పడి అక్కా తమ్ముడు..
తుమకూరు: మధుగిరి తాలూకాలోని మిడిగేశి చెరువులో కాసపుర గ్రామానికి చెందిన మంజునాథ పిల్లలు సుచిత్ర (11), రవీంద్ర (9) నీట మునిగి మరణించారు. ఎండగా ఉండడంతో నీటిలో ఆడుకుందామని పిల్లలు చెరువు వద్దకు వెళ్లారు, అలా నీట మునిగి చనిపోయి ఉంటారని అనుమానాలున్నాయి. పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు గాలించగా చెరువులో విగతజీవులగా కనిపించారు. మిడిగేశి పోలీసులు మృతదేహాలను వెలికితీసి మధుగిరి ఆసుపత్రికి తరలించారు. పిల్లలిద్దరూ కానరాని లోకాలకు చేరడంతో తల్లిదండ్రులు పెద్ద పెట్టున విలపించారు. వేసవి సెలవుల్లో పిల్లలను చెరువులు, కుంటల దగ్గరకు పంపకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని విద్యాధికారి హనుమంతరాయప్ప తెలిపారు. ఇలాంటి విషాదం జరగడం విచారకరమని, పిల్లలు దూరంగా వెళ్లకుండా తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని అన్నారు.
ఆనేకల్ వద్ద విషాద ఘటన


