రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దేవసూగూరులో వెలసిన బీరలింగేశ్వర రథోత్సవం వైభవంగా ముగిసింది. సోమవారం రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. పసుపు భండారను చల్లుకోవడంతో పాటు స్వామి వారికి పల్లకీ సేవ చేపట్టారు.
ఐజీపీ హర్షకు కువెంపు వర్సిటీ పీహెచ్‌డీ
బళ్లారిఅర్బన్: ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పీఎస్ హర్షకు వన్యప్రాణుల నిర్వహణ విభాగంలో చేసిన పరిశోధనకుగాను కువెంపు విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టాను ప్రకటించింది. మే 6న జరుగనున్న స్నాతకోత్సవంలో ఈ పట్టాను ఆయనకు ప్రదానం చేయనున్నారు. విశ్వవిద్యాలయ వన్యప్రాణి నిర్వహణ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌కుమార్ మార్గదర్శకత్వంలో ఐజీపీ పీఎస్ హర్ష ఐదేళ్ల పాటు క్షేత్ర స్థాయిలో పరిశోధన చేశారు. నాగరహొళె, బండీపుర బీఆర్‌టీ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల జనాభా స్థిరత్వం, మానవుడు, పులుల సంఘర్షణపై ప్రత్యేక దృష్టి అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఈ పరిశోధనలో విస్తృత స్థాయిలో కెమెరా ట్రాపింగ్, మానవుడు, పులి సంఘర్షణ ప్రాంతాలపై విశ్లేషణ వంటి అంశాలున్నాయి. వన్యప్రాణి సంరక్షణ రంగానికి ఈ గ్రంథం ముఖ్యమైన సహకారం అందించనుంది. వర్సిటీ సిండికేట్ ఈ పట్టాను అధికారికంగా ఆమోదించింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
● మరో ఇద్దరికి గాయాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా మరో ఇద్దరు గాయపడిన ఘటన జరిగింది. జాతరను ముగించుకొని శాఖాపురకు తిరిగి వెళుతుండగా టిప్పర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఆంజనేయ నాయక్(26), అర్చన(23) మరణించగా, శ్వేత(20), లక్ష్మి(18)లకు గాయాలయ్యాయి. ఘటనపై సిరవార పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గోవుల సంరక్షణకు చర్యలు చేపట్టరూ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గోమాతల సంరక్షణకు చర్యలు చేపట్టాలని భజరంగ దళ్ డిమాండ్ చేసింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణ బసవ మాట్లాడారు. జాతీయ ఆరాధ్య దైవంగా భావించే గోమాతను వధించరాదన్నారు. నానాటికీ గో సంతతి నశించి పోతోందని, గోవుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ రాష్ట్రపతికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సోనీ, దీక్షిత్, కృష్ణ, చంద్రశేఖర్‌లున్నారు.
1న జనాక్రోశ సమావేశం
హుబ్లీ: పార్లమెంట్‌లో మహిళా బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. అరవింద నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో మహిళా జనాక్రోశ సమావేశం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 1న మహిళా జనాక్రోశ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఇది మహిళలపై కాంగ్రెస్ విధానాలను ఎడగట్టే కార్యక్రమం అన్నారు. తాము అమల్లోకి తేవాల్సిన బిల్లును కాంగ్రెస్ ఓడించిందన్నారు. సమావేశంలో మహిళా నాయకురాలు సీ.మంజుల మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును సహించలేక, మహిళలు రాజకీయంగా ఎదగరాదన్న కుట్రతో కాంగ్రెస్ బిల్లు వ్యతిరేకించడంతో ఓడిపోయిందన్నారు. దీనికి తగిన గుణపాఠం చెప్పడానికి మే 1న భారీ సంఖ్యలో మహిళలు సమావేశమై బిల్లు వ్యతిరేకులకు తగిన గుణపాఠం నేర్పాలన్నారు.


