సాక్షి,బళ్లారి: గోవుల్లో సకల దేవతలు నివసిస్తారని, గోవులను పూజిస్తే దేవతలకు పూజలు చేసినట్లు అవుతుందని, అలాంటి గోవులను రక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ముఖ్యంగా గోవధ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సోమవారం బీజేపీ, హిందూ సంఘాల వేదిక ఆధ్వర్యంలో నగరంలోని రాఘవ కళామందిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గోవులను పలు ప్రాంతాల్లో దారుణంగా హింసించి వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, సవరణలు చేయడం సరికాదన్నారు.
గోవధ ఖండనీయం
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ గోవులను వధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గోసంరక్షణ కేవలం ధార్మికంగానే కాకుండా, మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా కూడా కొనసాగించాలన్నారు. గోవధ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గోవులను కాపాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. దేవతలందరికీ పూజలు చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ నాయకులు కే.ఎస్.దివాకర్, అశోక్ కుమార్, ఐనాథరెడ్డి, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.
గోవధ నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ర్యాలీ చేపట్టిన నాయకులు
ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులు
ఆ చట్టానికి సవరణలు వద్దు
గోమాతలకు రక్షణ కల్పించాలి
హిందూ సంఘాల డిమాండ్


