మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు | - | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

సాక్షి,బళ్లారి: దేశంలో గ్రామ స్థాయి నుంచి మహిళలకు రిజర్వేషన్‌ తెచ్చిన ఘనత, చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్న సంకల్పం కూడా కాంగ్రెస్‌ పార్టీదేనని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఎందుకు అడ్డుకుంటుందని, కేవలం బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసి, డీలిమిటేషన్‌ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టడం వల్ల కాంగ్రెస్‌ పార్టీతో సహా ఇతర పార్టీలు అడ్డుకున్నాయని సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, ఎమ్మెల్సీ నాగమణి, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కమలా మరిస్వామి ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బీజేపీపై వారు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 2023లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అందుకు అన్ని పార్టీలు కూడా సమ్మతి తెలిపాయన్నారు. అలాంటిది మళ్లీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్‌ అమలు చేస్తే దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సూచించారు. జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశ ప్రజలు పాటిస్తే, ఉత్తర భారత దేశ ప్రజలు జనాభా నియంత్రణ పాటించకపోవడంతో అక్కడ విపరీతంగా జనాభా పెరిగి సీట్లు పెంచితే దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తమిళనాడులోని డీఎంకే, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎత్తుగడ వేసి, మహిళలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. అసలు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్న ఆలోచన బీజేపీకి లేదన్నారు. ఉండి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగా వెంటనే అమలు చేసి మాట్లాడాలన్నారు. మహిళలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారన్నారు. 2014 నుంచి వరుసగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అప్పుడే ఈ బిల్లును ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ అమలు చేయకపోగా కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లుతూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారో మహిళలకు బాగా తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లోగా అమలు చేయకపోతే బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మాజీ మేయర్‌ మోదుపల్లి రాజేశ్వరి, ఆశాలత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

మహిళల రిజర్వేషన్‌కు పునాది వేసిందే కాంగ్రెస్‌

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ కుట్ర

కాంగ్రెస్‌ పార్టీ మహిళా

ప్రజాప్రతినిధుల ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement