హుబ్లీ: శ్మశానానికి సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకొని సదరు భూమికి పరిహారం చెల్లించని నేపథ్యంలో ధార్వాడ రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది ధార్వాడ సహాయక కమిషనర్ కార్యాలయంలోని పరికరాలను జప్తు చేశారు. జిల్లాలోని నవలగుంద తాలూకా కొండికొప్ప గ్రామానికి చెందిన నాగనగౌడ పాటిల్ అనే వ్యక్తికి చెందిన రెండు ఎకరాల భూమిని 2010 ఏప్రిల్ 8న స్వాధీనం చేసుకున్నారు.
రూ.35 లక్షల పరిహారం చెల్లించాల్సింది
గ్రామంలో ప్రైవేట్ పొలంలో అంత్యక్రియలు చేస్తున్నందు వల్ల శ్మశాన స్థలం కోసం స్వాఽధీనం చేసుకున్న ఈ భూమిలో ప్రతి గుంటకు రూ.10,500 చొప్పున మొత్తం రూ.35 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది. జిల్లా యంత్రాంగం రూ.20 లక్షలు ఇవ్వగా ఇంకా రూ.15 లక్షలు బకాయి ఉన్న నేపథ్యంలో సదరు రైతు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు కార్యాలయ పరికరాల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.
తహసీల్దార్ అభ్యర్థనతోనే భూమి ఇచ్చాం
ఈ విషయమై రైతు సోదరుడు భీమన గౌడ మాట్లాడుతూ గ్రామంలో శ్మశానానికి స్థలం లేదు. ప్రైవేట్ స్థలంలో అంత్యక్రియలు జరిపే వారు. దీంతో తహసీల్దార్ తమను భూమిని ఇవ్వమని అడిగారు. దీంతో మేం పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ ప్రకారం భూ స్వాధీనం అయింది. అయితే డబ్బులు చెల్లించలేదు. దీంతో కోర్టుకు వెళ్లాం. జిల్లా యంత్రాంగం నుంచి రూ.15 లక్షల బకాయి ఉన్నందు వల్ల మరోసారి కోర్టు వెళ్లి స్టే తెచ్చాం. అయినా తమకు డబ్బులు చెల్లించలేదు. పరిహారం చెల్లింపునకు చాలా వేధించారు.
బకాయి చెల్లించనందుకే జప్తు
రూ.15 లక్షలు బకాయిలు చెల్లించని కారణంగా కోర్టు నుంచి వారెంట్ జారీ కావడంతో జప్తు చేశారన్నారు. న్యాయవాది శివాని పాటిల్ వివరిస్తూ భూస్వాధీనం చేసుకున్న పొలానికి పరిహారంగా రూ.35 లక్షలు చెల్లించాలి. అందులో రూ.20 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షలు ఇంకా బకాయి ఉంది. ఈ విషయంలో ఎన్నో సార్లు ఆఫీసుకు వెళ్లి అడిగాం. అయినా ఇవ్వలేదు. మేం నాలుగు చెయిర్లు, ఓ కంప్యూటర్‌ను జప్తు చేశామని న్యాయవాది వివరించారు.
రైతుకు భూ పరిహారం
చెల్లించనందుకు కోర్టు ఆదేశం


