హొసపేటె: బెంగళూరు నుంచి కుష్టగికి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని బణవికల్లు సమీపంలో హైవే–50 పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడిపోవడంతో 9 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన సోమవారం తెల్లవారు జామున సుమారు 2.30 గంటలకు జరిగింది. ఘటనలో గాయపడిన శివయ్య, మంజునాథ్, అమృత, సురేష్, శకుంతలతో పాటు మొత్తం 9 మందిని కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం వైద్యులు కొప్పళ ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి కుష్టగికి సుమారు 61 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కరిబసప్ప తెల్లవారు జామున జాతీయ రహదారి–50పై కూడ్లిగి వైపు వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బస్సు రోడ్డుకు ఎడమ వైపున ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి, గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనతో నిద్రలో ఉన్న ప్రయాణికులు లేచి బిగ్గరగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, టోల్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తొమ్మిది మంది గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కొప్పళ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులు, డ్రైవర్, ఆపరేటర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఈ ఘటన హొసహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరగగా, ఎస్‌ఐ సిద్దరామ బిదరాణి సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు.
తొమ్మిది మందికి తీవ్ర గాయాలు
విజయనగర జిల్లాలో ప్రమాదం


