హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని మీనాకెరె గ్రామ శివారులోని పొలంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో గడ్డివాము, మేకలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మొలకాల్మూరు తాలూకా చిక్కుంతి గ్రామానికి చెందిన రైతు భాస్కర్.. కూడ్లిగి తాలూకా సరిహద్దులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్నాడు. 30కి పైగా ఉన్న మేకల కోసం షెడ్డు, పక్కనే గడ్డివాము వేసుకున్నాడు. గడ్డివాము మీదుగా విద్యుత్ స్తంభానికి అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఒక గడ్డివాము, 10 మేకలు కాలి బూడిదయ్యాయి. మొలకల్మూరు తాలూకాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.


