రాయచూరు రూరల్: మాన్విలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖా మంత్రి బోసురాజ్ అధికారులకు సూచించారు. మాన్వి పట్టణంలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్‌తో కలసి తాగునీటి పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుంగభద్ర నీటి సౌలభ్యంపై ఆధారపడిన గ్రామాలకు నీటి సరఫరాలో జాప్యం కాకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలకు నిత్యం తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. వేసవిలో విద్యుత్ కోత, మోటార్ల మరమ్మతులు, ఇతరత్ర కారణాలు చెప్పొదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, నీటి కుంటలను నీటితో నింపేలా తాలుకా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు.
యడ్డి సభకు సన్నాహాలు
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి మాజీ సీఎం యడియూరప్ప చాలా కృషి చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన మహా నాయకుడు యడియూరప్ప అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర పేర్కొన్నారు. మే 9వ తేదీన చిత్రదుర్గంలో యడియూరప్ప 50 సంవత్సరాలు రాజకీయ అరంగ్రేటం సంబంధించి విజయోత్సవ, అభినందన కార్యక్రమం జరగనుంది. ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయడానికి మాజీ మంత్రులు, పలువురు స్వామీజీల సమక్షంలో భూమిపూజ చేశారు. అనంతరం విజయేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మందిని చేర్చి పెద్ద ఎత్తున అభినందన సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. యడియూరప్ప అభిమానులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
తాగునీటి కోసం నిరసన
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా స్పందించరా అని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపలదిన్ని పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. 15 రోజలకు ఒకసారి నీరు వదిలితే ఎలా అని మండిపడ్డారు. సమయానికి తాగునీరు సరఫరా చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. సకాలంలో నీరు సరఫరా చేయాలని కోరుతూ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఉద్యాన వనాల
అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: నగరంలో ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని బిల్వ మందిర్ గార్డెన్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేకేఆర్డీబీ నుంచి విడుదలైన రూ.30 లక్షలతో అభివృద్ధి పనుల చేపడుతామన్నారు. నగరంలో పలు గార్డెన్లు ఉండగా.. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం బాయిదొడ్డిలో సీసీ రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నాగరాజ్, సత్యనాథ్, వెంకటేష్, దీపక్ రెడ్డి, అంజన్ కుమార్, రజాక్, ఖరీమ్, ఉస్మాన్, రఫీ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.


