తుది దశకు డ్యాం గేట్ల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

తుది దశకు డ్యాం గేట్ల ఏర్పాటు

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

మే నెలఖరు నాటికి పూర్తయ్యే

అవకాశం

హొసపేటె: తుంగభద్ర డ్యాంలో కొద్ది నెలలుగా చేపడుతున్న నూతన 33 క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం చిన్నపాటి సాంకేతిక, తుది దశ పనులు, కొత్త గొలుసుల ఏర్పాటు మాత్రమే మిగిలాయి. కేవలం ట్రయల్‌ అండ్‌ రన్‌, విద్యుత్‌ పరీక్షలు, తుది భద్రతా తనిఖీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గేట్లను పైకి లేపుతూ, కిందకు దించే, నీటి పీడనాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించడం జరిగింది. ముఖ్యంగా, 18వ నంబర్‌ గేటు యొక్క ట్రయల్‌ అండ్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన గేట్ల విద్యుత్‌ పనులు కూడా పూర్తయ్యాయి. తుంగభద్ర జలాశయం మూడు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో సుమారు 14 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే ఒక ప్రధాన నీటి వనరు. వ్యవసాయం, తాగునీరు పరిశ్రమలకు ఈ జలాశయం నుంచి వచ్చే నీరు అత్యవసరం కాబట్టి, క్రస్ట్‌ గేట్‌ పనులు నాణ్యతతో పూర్తి చేయబడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ పని పర్యవేక్షణ, పరిపాలన బాధ్యతను తుంగభద్ర బోర్డులోని వివిధ స్థాయిల అధికారులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌ మాట్లాడుతూ.. తుంగభద్ర జలాశయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కేవలం చైన్‌ లింకుల ఏర్పాటు మాత్రమే మిగిలి ఉంది. కొత్త చైన్‌ లింకులు మే 1వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన వెంటనే, పాత చైన్లను పూర్తిగా తొలగించి, కొత్త చైన్లను అమర్చడం జరుగుతుంది. జలాశయం భద్రత, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement