హొసపేటె: తుంగభద్ర డ్యాం వద్ద 19వ క్రస్ట్‌గేట్ 2024 ఆగస్ట్ 10న తెగిపోయి కొట్టుకుపోవడంతో నాలుగు జిల్లాల్లోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గేట్లను మార్చడంతో పాటు వాటిని ఆపరేట్ చేయడానికి అవసరమైన గొలుసులను కూడా మార్చాలని ఇప్పుడు నిర్ణయించారు. నవంబర్ నెలలో 19వ గేట్ స్థానంలో తాత్కాలిక స్టాప్‌లాక్ గేటును బిగించి నీటి వృథా అరికట్టారు. గేట్ల గడువు ముగిసినా వాటిని మార్చకపోవడం, గొలుసులు ఊడిపోవడమే దీనికి మూల కారణమని నిపుణులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం మేల్కొని మొత్తం గేట్లను మార్చేందుకు చర్యలు చేపట్టింది. సుమారు రూ.42 కోట్ల వ్యయంతో 33 గేట్లను మార్చే పని ప్రారంభమైనప్పటికీ, పాత గొలుసులను మార్చకుండా వాటినే కొనసాగించాలని తొలుత నిర్ణయించారు.
రైతుల నుంచి వ్యతిరేకతతో నిర్ణయం
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది. తుంగభద్ర డ్యాంలోని మొత్తం 33 గేట్లన్నింటికీ కొత్త గొలుసులను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.5.5 కోట్ల అదనపు గ్రాంటును విడుదల చేయగా, టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ఎస్.బోసురాజు ఇటీవల స్పందిస్తూ గేట్లతో పాటు గొలుసులను కూడా మారుస్తామని తెలిపారు. మంత్రి డ్యాం గేట్ల పనులను పరిశీలించి మాట్లాడారు. పనులు ఇప్పుడు వేగవంతం అయ్యాయి. 18 గేట్ల డిమెటలింగ్ పని ఇప్పటికే పూర్తయింది. ఐదు కొత్త గేట్లను అమర్చారు. మిగిలిన గేట్ల పనులు కూడా నిరంతరం పురోగమిస్తున్నాయి. మే నెలాఖరులోగా అన్ని గేట్లను అమర్చాలని ప్రభుత్వం కాంట్రాక్టు కంపెనీకి గడువు విధించిందన్నారు.
జూన్‌కల్లా పనులు పూర్తి, రైతులకు
ఆందోళన వద్దు –మంత్రి
మే నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలోగా పనులన్ని పూర్తవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. తుంగభద్ర జలాశయం తొలి క్రస్ట్ గేట్ ఏర్పాటు విజయవంతమైంది. మరో వైపు పనులు నెమ్మదిగా సాగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గేట్ల మార్పు ఆలస్యమైతే, వచ్చే ఏడాది కూడా వేసవి పంటలకు నీటి సమస్య కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేసి రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద తుంగభద్ర జలాశయంలో గేట్ల మార్పిడి పనులు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇవి సకాలంలో పూర్తయితే లక్షలాది మంది రైతులకు ఉపశమనం లభిస్తుంది.
తుంగభద్ర డ్యాం వద్ద క్రస్ట్‌గేట్ల పనులు చేపట్టిన దృశ్యం
క్రేన్ సాయంతో కొత్త గేట్‌ను బిగిస్తున్న దృశ్యం
19వ క్రస్ట్‌గేట్ కొట్టుకుపోయిన
తర్వాత మేల్కొన్న ప్రభుత్వం
తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం


