బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాంత్వన | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాంత్వన

Mar 29 2026 7:23 AM | Updated on Mar 29 2026 7:23 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర నదిలో మునిగి నలుగురు మృతి చెందిన విషయంపై రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ మృతుల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో మృతదేహాలకు పూలమాలలు వేసి ఒక కుటుంబానికి రూ.50 వేల నగదు పరిహారాన్ని అందించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యోగాల భర్తీ చేపట్టాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 52,432 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగుల పోరాట సమితి డిమాండ్‌ చేసింది. శనివారం కలబుర్గిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శాంత కుమార్‌ మాట్లాడారు. ఇటీవల హుబ్లీ–ధార్వాడ, బాగలకోటెల్లో ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి త్వరిత గతిన నియామకాలు చేపట్టాలంటూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందుకు రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీని ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రాన్ని జిల్లాధికారికి సమర్పించారు.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

చెళ్లకెరె రూరల్‌: నేటి ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడితో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి తెలిపారు. ఆయన చెళ్లకెరె తాలూకా నగరంగెరె గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నగరంగెరెకు తాలూకాలోని అనేక చోట్ల నుంచి ప్రజలు వచ్చి ఈ ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జయదేవ ఆస్పత్రి మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌, డాక్టర్‌ ప్రహ్లాద్‌, డాక్టర్‌ పాలాక్ష, గ్యారెంటీ సమితి అధ్యక్షుడు గద్దిగేరి తిప్పేస్వామి, ఓబన్న, లింగప్ప, కుమారస్వామి, మైలారప్ప, రాజు, రంగనాథ్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ సిలిండర్లతో నిరసన

హొసపేటె: గ్యాస్‌ సిలిండర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం కార్యకర్తలు విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలో ఖాళీ సిలిండర్లను ఉంచి నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకురాలు వీణా మహంతేష్‌ మాట్లాడుతూ గత నెల రోజులుగా వంటగ్యాస్‌ కొరత కారణంగా ప్రజలు రోజూ వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాలూకాలోని గ్రామాలకు సిలిండర్లను సరఫరా చేసి ఈ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి చేశారు.

రూ.6.62 లక్షల సామగ్రి చోరీ

హుబ్లీ: స్థానిక జవళి స్ట్రాల్‌లోని ఎలక్ట్రికల్‌ అంగడి తాళం పగలగొట్టి సుమారు రూ.6.62 లక్షల విలువ చేసే సామగ్రితో పాటు నగదును చోరీ చేశారు. కుసుగల్‌ రోడ్డులని శివగంగా లేఅవుట్‌ నందివర్ధన్‌ దోషికి చెందిన అంగడిలో రూ.5.60 లక్షల నగదు, అలాగే రూ.1.2 లక్షల విలువ చేసే పూజ సామగ్రి, మొబైల్‌ చోరీ చేశారు. ఘటనపై గంటికేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

వేడుకగా శోభాయాత్ర

రాయచూరు రూరల్‌: నగరంలో శుక్రవారం సాయంత్రం కోదండ రామాలయం వద్ద శ్రీరాముని శోభాయాత్ర వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని ఉత్సవాలను శాంతమల్ల శివాచార్య ప్రారంభించారు. భక్తుల కోలహలం మధ్య నగరంలో శ్రీరాముడు, ఆంజనేయుడి విగ్రహాలను ఊరేగించారు. యాత్రలో మాజీ ఎంపీ బీ.వీ.నాయక్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్‌ హవల్దార్‌, ఏఎస్పీ హరీష్‌, డీఎస్పీ శాంతవీర, నాగరాజ్‌, శాంతప్ప, గోపాలరెడ్డిలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement